సెమీస్‌ లక్ష్యంగా! న్యూజిలాండ్‌ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్‌

9 Nov, 2023 17:28 IST|Sakshi

ICC Cricket World Cup 2023- New Zealand vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించారు.

భారత్‌ వేదికగా ప్రపంచకప్‌-2023లో ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్‌.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరగా.. నాలుగో స్థానం కోసం కివీస్‌ పోరాడుతోంది.

ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్‌ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

ఆరంభంలోనే ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక(2)ను టిమ్‌ సౌథీ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌(6)ను ట్రెంట్‌ బౌల్ట్‌ అవుట్‌ చేశాడు.  అంతేకాదు.. నాలుగో స్థానంలో వచ్చిన సమరవిక్రమ(1), ఐదో నంబర్‌ బ్యాటర్‌ చరిత్‌ అసలంక(8)ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి పవర్‌ ప్లేలోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

A post shared by ICC (@icc)

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా పట్టుదలగా నిలబడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థ శతకం సాధించి.. లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగుల మార్కు అందుకున్నాడు.

కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెరీరాకు సహకారం కరువైంది. దీంతో లంక స్కోరు బోర్డు నత్తనడకన సాగుతుండగా.. పెరీరా వికెట్‌ తీసి లాకీ ఫెర్గూసన్‌ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్‌ మూడో బంతికి  ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో మిచెల్‌ సాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరీరా వెనుదిరిగాడు.

దీంతో లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనానికి అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడు. పవర్‌ ప్లే ముగిసే లోపే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్‌ పెరీరా అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా 74 పరుగులు చేసిన శ్రీలంకను.. ఆ తర్వాత కివీస్‌ బౌలర్లు ఏ దశలోనూ  కోలుకోనివ్వలేదు. 

వరుసగా వికెట్లు పడగొట్టారు. అయితే మహీశ్‌ తీక్షణ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో 46.4 ఓవర్లలో 171 పరుగులకు లంక  ఆలౌట్‌ అయింది.

న్యూజిలాండ్‌ బౌలర్లలో బౌల్ట్‌ మూడు, ఫెర్గూసన్‌, మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్‌ దక్కింది.  ఈ నేపథ్యంలో లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని వీలైనన్ని తక్కువ బంతుల్లో ఛేదించి రన్‌రేటు మెరుగుపరచుకోవడంపైనే న్యూజిలాండ్‌ దృష్టి సారించింది.

అయితే, ఓవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు.. గత ముఖాముఖి పోరు ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. దీంతో న్యూజిలాండ్‌ సెమీస్‌ అవకాశాలు ప్రస్తుతానికి వరుణుడు, లంక బౌలర్ల ప్రదర్శన తీరుపైనే ఆధారపడి ఉన్నాయి.

చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్‌ సోదరుడి వార్నింగ్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు