కోహ్లి రికార్డులపై వ్యంగ్యంగా కామెంట్స్‌ చేసిన పాక్‌ మాజీ కెప్టెన్‌

12 Dec, 2022 22:00 IST|Sakshi

టీమిండియా క్రికెటర్లపై సమయం దొరికినప్పుడంతా అక్కసుతో కూడిన కామెంట్స్‌ చేయడం పాకిస్తాన్‌ మాజీలకు పరిపాటిగా మారింది. రమీజ్‌ రజా, షోయబ్‌ అక్తర్‌, షాహీద్‌ అఫ్రిది లాంటి వారికైతే టీమిండియా క్రికెటర్లపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేయకపోతే నిద్ర కూడా పట్టదు. ఈ జాబితాలోకి తాజాగా మరో పాకీ చేరాడు. కొద్దికాలం పాటు పాక్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్‌ లతీఫ్‌.. తాజాగా పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లిపై నోరు పారేసుకున్నాడు.

కోహ్లి రికార్డులను ఉద్దేశించి వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశాడు. కోహ్లి 100 సెంచరీలు సాధించడం ముఖ్యం కాదని, దేశానికి టైటిళ్లు అందించడమే ముఖ్యమని ఎద్దేవా చేశాడు. భారత క్రికెట్‌ అభిమానులు కోహ్లి రికార్డుల కోసం ఎదురుచూడట్లేదని, టీమిండియా టైటిల్‌ సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచుస్తున్నారని అన్నాడు.

ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా దారుణ వైఫల్యాలను ఎత్తి చూపాడు. కోహ్లి 200 సెంచరీలు కొట్టినా, టీమిండియా టైటిళ్లు గెలవకపోతే ఉపయోగం లేదని ఎద్దేవా చేశాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో కోహ్లి 44వ వన్డే శతకం సాధించిన అనంతరం ల'తీఫ్‌' ఈ వ్యాఖ్యలు చేశాడు.  

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ 100 శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బంగ్లాపై సెంచరీతో కోహ్లి.. 72 అంతర్జాతీయ శతకాలతో రికీ పాంటింగ్‌ను (71) వెనక్కునెటి​ సచిన్‌ తర్వాతి స్థానానికి ఎగబాకాడు. వన్డేల్లో కోహ్లి మరో 6 శతకాలు బాదితే ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరిస్తాడు. 
 

మరిన్ని వార్తలు