#Shweta Sehrawat: 242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్?

7 Jan, 2024 07:43 IST|Sakshi
శ్వేతా సెహ్రావత్(PC: BCCI), ఫైల్‌ ఫోటో

బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఢిల్లీ యువ సంచలనం శ్వేతా సెహ్రావత్  విధ్వంసం సృష్టించింది. శనివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్వేతా సెహ్రావత్‌ అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు శ్వేతా చుక్కలు చూపించింది.

బౌండరీల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్‌లో 150 బంతులు ఎదుర్కొన్న సెహ్రవత్‌ 31 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 242 పరుగులు చేసింది.  తద్వారా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ద్విశతకం సాధించిన తొలి మహిళ క్రికెటర్‌గా శ్వేతా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా దేశీవాళీ క్రికెట్‌(మూడు ఫార్మాట్లు)లో అత్యధిక స్కోర్‌ సాధించిన మహిళ క్రికెటర్‌గా నిలిచింది.

ఎవరీ శ్వేతా సెహ్రావత్ ..
20 ఏళ్ల శ్వేతా సెహ్రావత్‌ దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. గతేడాది జరిగిన అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆ టోర్నీలో టాప్ రన్‌‌ స్కోరర్‌గా శ్వేతా సెహ్రావత్‌ నిలిచింది. కాగా శ్వేత మహిళల ప్రీమియర్‌లో లీగ్‌లో కూడా భాగమైంది.

ఈ యువ సంచలనం యూపీ వారియర్జ్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. 2023 డబ్ల్యూపీఎల్‌ వేలంలో రూ.40 లక్షలకు శ్వేతాను యూపీ సొంతం చేసుకుంది. కానీ ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మాత్రం ఆమె నిరాశపరిచింది. తొలి సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన సెహ్రావత్‌ కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది.

>
మరిన్ని వార్తలు