Wimbledon 2023: అల్‌కరాజ్‌ అలవోకగా...

5 Jul, 2023 05:50 IST|Sakshi

రెండో రౌండ్‌లోకి టాప్‌ సీడ్‌

ముర్రే ముందంజ  

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోరీ్నలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ పది ఏస్‌లు సంధించి రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. చార్డీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసిన ఈ స్పెయిన్‌ స్టార్‌ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయాడు.

నెట్‌ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్‌కరాజ్‌ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్‌ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. రియాన్‌ పెనిస్టన్‌ (బ్రిటన్‌)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు.  వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది.

పైకప్పు కలిగిన సెంటర్‌ కోర్టు, నంబర్‌వన్‌ కోర్టులోని మ్యాచ్‌లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రిబాకినా (కజకిస్తాన్‌) కష్టపడి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్‌ (పోలాండ్‌)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఏడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.  

>
మరిన్ని వార్తలు