‘జెయింట్స్‌’ హెడ్‌ కోచ్‌గా రేచల్‌ హేన్స్‌

4 Feb, 2023 04:37 IST|Sakshi

బౌలింగ్‌ కోచ్‌గా నూషీన్‌ అల్‌ ఖదీర్‌ నియామకం

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో అత్యధిక మొత్తంతో టీమ్‌ను సొంతం చేసుకున్న అహ్మదాబాద్‌ యాజమాన్యం అందరికంటే వేగంగా, చురుగ్గా టీమ్‌ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ టీమ్‌ ‘గుజరాత్‌ జెయింట్స్‌’కు భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను ఇటీవలే మెంటార్‌గా ఎంపిక చేయగా, ఇప్పుడు టీమ్‌ హెడ్‌ కోచ్‌ను ప్రకటించింది.

ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ ప్లేయర్‌ రేచల్‌ హేన్స్‌ ‘జెయింట్స్‌’కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనుంది. గత ఏడాదే ఆటకు గుడ్‌బై చెప్పిన హేన్స్‌ ఆసీస్‌ తరఫున ఆరు ప్రపంచకప్‌ విజయాల్లో భాగంగా ఉండటం విశేషం.ఆస్ట్రేలియా తరఫున ఆమె 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు మరో రెండు నియామకాలను కూడా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇటీవలే వరల్డ్‌కప్‌ నెగ్గిన భారత మహిళల అండర్‌–19 టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్‌ అల్‌ ఖదీర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా... తుషార్‌ అరోథేను బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేశారు. గత ఏడాది మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ నెగ్గిన ‘సూపర్‌ నోవాస్‌’కు కోచ్‌గా పని చేసిన అనుభవం నూషీన్‌కు ఉండగా, బరోడా మాజీ క్రికెటర్‌ తుషార్‌ భారత సీనియర్‌ మహిళల టీమ్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.   

మరిన్ని వార్తలు