Bajrang Punia Returns Padma Shri: బజరంగ్‌ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ! నాకు ‘గౌరవం’ వద్దు!

22 Dec, 2023 18:20 IST|Sakshi

Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. 

కాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే.  దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు జరిగాయి.

ఇందులో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత అనితా షెరాన్‌పై.. ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్‌ కుమార్‌ సింగ్‌ గెలుపొందాడు. బ్రిజ్‌ భూషణ్‌కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 

ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్‌ వంటి ఒలింపిక్‌ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్‌ ఫొగాట్‌.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్‌ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్‌ భూషణ్‌ మళ్లీ డబ్ల్యూఎఫ్‌ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించింది.

ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్‌ బజరంగ్‌ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. 

ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను.

బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. 

అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు.

కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్‌ చేశారు. అయితే, ఏప్రిల్‌ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్‌ భూషణ్‌ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్‌ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు.

>
మరిన్ని వార్తలు