బీజేపీ Vs సిద్ధరామయ్య: మరి మోదీ సంగతేంటీ.. కాంగ్రెస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

22 Dec, 2023 15:42 IST|Sakshi

కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఓ విలాసవంతమైన ప్రైవేటు జెట్‌లో ప్రయాణించడం విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్‌ నేతలు సైతం ప్రధాని మోదీ, బీజేపీకి కౌంటరిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరేందుకు ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హస్తిన నుంచి బెంగళూరుకు విలాసవంతమైన చార్టర్డ్ విమానంలో వచ్చారు. కర్ణాటక మంత్రి జమీర్‌ అహ్మద్‌ సిద్ధరామయ్యతో కలిసి విమాన ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు.
 

ఇక, సీఎం సిద్ధరామయ్య ప్రైవేటు జెట్‌లో విహరిస్తున్నారంటూ ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రం మొత్తం తీవ్ర కరవుతో అల్లాడుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు కోల్పోయి.. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. మరోవైపు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు వారి సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారు. పైగా.. కేంద్రం నుంచి కరవు సహాయక నిధుల అభ్యర్థన కోసం విలాసవంతమైన విమానంలో ప్రయాణించడం గమనార్హం. మన దురవస్థను అపహాస్యం చేయడమే ఇది. పన్ను చెల్లింపుదారుల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం కాంగ్రెస్‌ మంత్రులకు చాలా సులభం కర్ణాటక నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

కాగా, బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్‌ గట్టిగా తిప్పి కొట్టింది. బీజేపీ నేతల ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రయాణిస్తారు? ఏ విమానంలో రాకపోకలు సాగిస్తారు? ఈ విషయం బీజేపీ నేతలను అడగండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎప్పుడూ అసంబద్ధ వాదనలు చేస్తుంటారు. ఆపరేషన్ కమల్‌ ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉంది. ఆపరేషన్ కమల్‌ కోసం వందల కోట్ల రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబై చుట్టు తిప్పడానికి విమానం ఎవరు ఇచ్చారని, వారాల తరబడి విలాసవంతమైన హోటళ్లలో బస చేసి సరదాగా గడిపిన ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కూలీ పనులు చేసి ఆపరేషన్ కమల కోసం ఖర్చు చేశారా? అని నిలదీశారు. దీంతో, బీజేపీ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

చదవండి: భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్‌.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్‌

>
మరిన్ని వార్తలు