-

WTC Final: నెట్స్‌లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో వైరల్‌

31 May, 2023 15:13 IST|Sakshi

WTC Final 2023- Yashasvi Jaiswal: రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023 నేపథ్యంలో ప్రాక్టీసు​ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాతో టీమిండియా మెగా ఫైట్‌కు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాడు.

కాగా ఇంగ్లండ్‌ వేదికగా భారత్‌- ఆసీస్‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7- 11 వరకు టెస్టు మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు బోర్డులు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ఖరారు చేశాయి.

రుతురాజ్‌ స్థానంలో లండన్‌కు
ఇదిలా ఉంటే.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి 15 మంది ప్రధాన ఆటగాళ్లతో పాటు ముగ్గురిని స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. తొలుత ప్రకటించిన జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఢిల్లీ ​క్యాపిటల్స్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ తదితరులను స్టాండ్‌ బై ప్లేయర్లుగా పేర్కొంది.

అయితే, జూన్‌ మొదటి వారంలో తన పెళ్లి ఉన్న కారణంగా రుతురాజ్‌ తప్పుకోగా.. ముంబై యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. రుతురాజ్‌ స్థానంలో యశస్వికి జట్టులో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్‌ శర్మతో పాటు యశస్వి జైశ్వాల్‌ సోమవారం లండన్‌కు చేరుకున్నాడు.

ప్రాక్టీసు మొదలుపెట్టిన యశస్వి
ఇక ఆసీస్‌తో కీలక పోరు కోసం ఇప్పటికే టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో యశస్వి సైతం బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి విడుదల చేసింది. జైశ్వాల్‌ ఫస్ట్‌లుక్‌ పేరిట షేర్‌ చేసిన ఈ వీడియోలో అతడు.. అశ్విన్‌, విరాట్‌ కోహ్లిల నుంచి మెలకువలు నేర్చుకున్నట్లు కనిపించింది. కాగా 21 ఏళ్ల యశస్వి జైశ్వాల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అదరగొట్టి
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై బ్యాటర్‌ 315 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఇక ఇరానీ కప్‌ టోర్నీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో వరుస ఇన్నింగ్స్‌లో శతకాల మోత మోగించాడు. ఓ డబుల్‌ సెంచరీ (213), ఓ శతకం (144) నమోదు చేసి రెస్టాఫ్‌ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌-2023లో ఓపెనర్‌గా సత్తా చాటి
ఇక ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన యూపీ కుర్రాడు యశస్వి జైశ్వాల్‌.. 14 మ్యాచ్‌లలో కలిపి 625 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన విషయం తెలిసిందే.

చదవండి: గిల్‌లో అద్బుతమైన టాలెంట్‌ ఉంది.. కచ్చితంగా లెజెండ్స్‌ సరసన చేరుతాడు: కపిల్‌ దేవ్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు