పీఎఫ్‌ సొమ్ము విడుదల

30 Mar, 2023 00:44 IST|Sakshi

1,235 మంది ఖాతాలకు రూ.79 కోట్లు జమ

అనంతపురం సిటీ: జిల్లా పరిషత్‌, అనుబంధ విభాగాల్లో పని చేసే ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో పని చేసే జెడ్పీ, మండల పరిషత్‌ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు సుమారు 1,235 మంది ఖాతాల్లో రూ.79 కోట్లు జమ అయినట్లు డిప్యూటీ సీఈఓ జల్లా శ్రీనివాసులు తెలిపారు. 2022 మే నుంచి ఇప్పటి వరకూ పీఎఫ్‌ పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ నగదు జమ చేయడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ సహకారం మరచిపోలేమని పలువురు తెలిపారు.

బిల్లుల అప్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి

ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తయిందని జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లా పరిషత్‌ అనుబంధం పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల ఆధ్వర్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ఎంఎస్‌(పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) తాగునీటి సరఫరాతో పాటు రహదారులు, భవనాలకు సంబంధించి చేసిన పనులకు ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామని వివరించారు. సుమారు వారం రోజుల పాటు తమ సిబ్బంది అన్ని మండలాల నుంచి సమగ్ర వివరాలు తెప్పించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారని పేర్కొన్నారు. మంజూరైన పనులు, నిధుల విడుదల, పెండింగ్‌ వివరాలన్నీ అందులో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు