భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

14 Nov, 2023 11:12 IST|Sakshi

శ్రీ సత్యసాయి: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లిలోని పాతూరుకు చెందిన నరసింహులు కుమారుడు చిన్న అక్కులప్ప (27)కు అనంతపురం రూరల్‌ మండలం తాటిచెర్లకు చెందిన సునీతతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన చిక్క అక్కులప్ప రోజూ మత్తులో ఇంటికి చేరుకుని భార్యను కొట్టేవాడు.

అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగు చెందిన ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రాకపోతే చనిపోతానని బెదిరించడంతో ఆమె భయపడి భర్త వద్దకు చేరుకుంది. మూడు రోజుల క్రితం మళ్లీ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని చితక్కొట్టడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాపురానికి రావాలని పదేపదే ప్రాధేయపడ్డాడు.

అయినా ఆమె రాకపోవడంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండడంతో చుట్టుపక్కల వారు గమనించి సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న అక్కులప్పను గుర్తించి, ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు