నిబంధనలు పాటించని వారిపై కొరడా

7 Jan, 2024 00:34 IST|Sakshi
● ధాన్యం కొనుగోలుపై సర్కారు ప్రత్యేక దృష్టి ● 31 మిల్లులు బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశం ● ఐదుగురు డీఏఓల తొలగింపు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఖరీఫ్‌ ధాన్యం సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ స్థాయిలో అధికారులు, సిబ్బంది, మిల్లర్లు తప్పు చేసినా, అలసత్వం వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఖరీఫ్‌లో ఇప్పటికే 2.60 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. తాజాగా జిల్లాలో తూనికల్లో అదనంగా 2 కిలోలు తీసుకుంటున్న మిల్లులపై చర్యలు చేపట్టారు. 31 మిల్లులపై 40 మంది రైతులు ఫిర్యాదు చేయగా, ఆ రైస్‌ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టారు. జేసీ ఎం.నవీన్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారించి దర్యాప్తు చేయించి అవినీతికి పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో ఈ ఏడాది 260 మిల్లులకు ధాన్యం సీఎంఆర్‌కు అనుమతులు ఇవ్వగా వీటిలో 31 మిల్లులపై వేటు పడింది. అలాగే ఆ మిల్లుల యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రైతుల ఫిర్యాదుల మేరకు, ధాన్యం సేకరణలో మిల్లర్లు బస్తాకు 2 కిలోలు ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసిన తక్షణం జేసీ ఆయా మిల్లులపై సంబంధిత ఉప తహసీల్దారులతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించి వారిపై చర్యలు తీసుకున్నారు. ఇకపై ఏ మిల్లర్‌ అయినా అదనంగా డిమాండ్‌ చేస్తే వారిని కూడా బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గార మండలంలో 2 మిల్లులు, జలుమూరు మండలంలో 2, కోటబొమ్మాళి మండలంలో 4, కొత్తూరు మండలంలో 3, ఎల్‌ఎన్‌పేట మండలంలో 2, నందిగాం మండలంలో 2, నరసన్నపేట మండలంలో 6, పలాస మండలంలో 2, సారవకోట మండలంలో 3, టెక్కలి మండలంలో 4, వజ్రపుకొత్తూరు మండలంలో 2 మిల్లులు బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

ఐదుగురి తొలగింపు

విధుల్లో అలసత్వం వహించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు. రైతు భరోసా కేంద్రాలు, అక్కడ పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, క్వాలిటీ సిబ్బందిపై కూడా వేటు పడింది. క్వాలిటీ కంట్రోల్‌లో అవకతవకలు, తేమ పరీక్షల్లో తేడాలు ఉన్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సకాలంలో ఽకొనుగోలు చేసిన ధాన్యంను అప్‌లోడ్‌ చేయడంలో, మిల్లులు ట్రాకింగ్‌లో అవకతవకలు, అలసత్వం వహించినందున, అలాంటి వారిపై పూర్తి స్థాయిలో దర్యాపు చేసి వారిని విధుల నుంచి తొలగించారు. సారవకోట మండలంలో పెద్దలంబ ఆర్‌బీకేలో డీఏఓ, కిన్నెరవాడ ఆర్‌బీకేలోని డీఏఓ, నరసన్నపేట మండలంలో చోడవరం డీఏఓ, సరుబుజ్జిలి మండలంలోని పాలవలస డీఏఓ, కొండవలస ఆర్‌బీకేలోని డీఏఓలను తొలగించారు.

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

మిల్లర్లు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ ఎం.నవీన్‌ తెలిపారు. పారదర్శకంగా కొనుగోలు సాగాలని, రైతులు ధాన్యంను ఆర్‌బీకేల ద్వారా విక్రయించాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు