20న రాష్ట్ర బడ్జెట్‌

28 Feb, 2023 22:18 IST|Sakshi
ప్రమాణ స్వీకారం చేస్తున్న అదనపు జడ్జి లక్ష్మీనారాయణన్‌

సాక్షి, చైన్నె: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24కు గాను) రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 20వ తేదీన అసెంబ్లీలో దాఖలు చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సచివాలయం ఆవరణలో జార్జ్‌ కోటలోని సమావేశ మందిరంలో శాసనసభ ప్రారంభం అవుతుందని సోమవారం రాత్రి అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ ప్రకటించారు. ఆర్థిక మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌ సభలో బడ్జెట్‌ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

చైన్నె, శివార్లలో విజృంభిస్తున్న విష జ్వరాలు

సాక్షి, చైన్నె: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తోంది. చైన్నె, దాని శివారు జిల్లాలో ఈ ప్రభావం అధికంగా ఉంది. ఫలితంగా చిన్న పిల్లల మొదలు వృద్ధుల వరకు ప్రైవేటు ఆసుపత్రులు, క్లీనిక్‌ల వద్ద క్యూ కడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో జనం అల్లాడుతున్నారు. బాధితులు కొందరు రెండు వారాలకు పైగా జ్వరాలతో మంచం పడుతున్నారు. దీంతో ఈ వైరల్‌ ఫీవర్‌పై పరిశోధనకు ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సెల్వ వినాయగం ఆదేశాలు జారీ చేశారు. విష జ్వరాలపై ఆందోళన వద్దని, ఇది ఏ రకం వైరస్‌ కారణంగా వస్తోందో పరిశీలన చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిశోధనలు చైన్నెలో ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొ న్నారు. జలుబు, దగ్గు ప్రారంభమైన వెంటనే ప్రజలు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.

న్యాయమూర్తి లక్ష్మీ నారాయణన్‌ బాధ్యతల స్వీకారం

సాక్షి, చైన్నె: మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది లక్ష్మీనారాయణన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో ఇన్‌చార్జ్‌ సీజే రాజ ప్రమాణ స్వీ కారం చేయించారు. వివరాలు.. మద్రాసు హైకోర్టులో ఖాళీల భర్తీలో భాగంగా 8 మంది పేర్లును సిఫారసు చేస్తూ గత నెల సుప్రీంకోర్టు కొలీజియానికి నివేదిక పంపిన విషయం తెలిసిందే. ఇందులో ఐదుగురి పేర్లను ఆమోదిస్తూ ఈనెల 7న కొలీజియం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఐదుగురు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉండగా న్యాయవాది లక్ష్మీనారాయణన్‌ను అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన తాజాగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా కొత్త న్యాయమూర్తికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 58కి చేరింది.

జన్మదిన వేడుకల్లోహంగామా వద్దు

– కార్యకర్తలకు స్టాలిన్‌ లేఖ

సాక్షి, చైన్నె: తన జన్మదిన వేడుకల సందర్భంగా ఎవరూ హంగామా సృష్టించ వద్దని, కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని నాయకులకు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యకర్తలకు లేఖ రాశారు. మార్చి ఒకటో తేదీన సీఎం స్టాలిన్‌ 70వ వసంతంలో అడుగు పెట్టనున్నారు. ఆయన బర్త్‌డేను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. భారీ బహిరంగ సభల రూపంలో చైన్నె వేదికగా వేడుకలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో జాతీయ స్థాయి నేతలు సైతం పాల్గొననున్నా రు. ఈ పరిస్థితుల్లో కేడర్‌కు సీఎం లేఖ రాశారు. తనపుట్టిన రోజున బ్యానర్లు, హోర్డింగ్‌లు వంటి హంగామాతో కూడిన ఏర్పాట్లతో చేయవద్దు అని సూచించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్న కమల్‌

– మళ్లీ అరుణాచలానికి అవకాశం

సాక్షి, చైన్నె: మక్కల్‌ నీది మయ్యం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విశ్వనటుడు, ఆ పార్టీ నేత కమలహాసన్‌ తప్పుకున్నారు. ఆ పదవిని మళ్లీ ఆ పార్టీ సీనియర్‌ నేత అరుణాచలానికి అప్పగించారు. వివరాలు.. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనేక మంది నేతలు కమల్‌ పార్టీని వీడారు. ఇందులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం కూడా ఉన్నారు. దీంతో ఆ పదవిని కూడా తన వద్దే కమల్‌ ఉంచుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవుల్లో కమల్‌ కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచలం మళ్లీ మక్కల్‌ నీది మయ్యం గూటికి చేరారు. దీంతో సోమవారం చైన్నెలో జరిగిన పార్టీ కార్యావర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రధాన కార్యదర్శి పదవిని తిరిగి అరుణాచలానికి అప్పగించారు. ఇకపై పార్టీ అధ్యక్ష పదవిలో మాత్రమే కమల్‌ కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు