ఢిల్లీకి మంత్రి ఉదయ నిధి

28 Feb, 2023 22:18 IST|Sakshi
తండ్రి స్టాలిన్‌తో ఉదయ నిధి
● నేడు ప్రధాని మోదీతో భేటీ

సాక్షి, చైన్నె: రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ సోమవారం ఉదయం ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. వివరాలు.. సీఎం ఎంకే స్టాలిన్‌ వారసుడు ఉదయ నిధి మంత్రయ్యాక.. పరిపాలనా వ్యవహారాల్లో దూసుకెళ్తున్నారు. గతంలో కరుణానిధి సీఎంగా ఉన్నకాలంలో మంత్రిగా స్టాలిన్‌ ఏ విధంగా అన్నీ తానై వ్యవహించేవారో.. అదే తరహాలో ప్రస్తుతం ఉదయ నిధి ప్రయాణం కూడా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంత వరకు రాష్ట్రానికి చెందిన మంత్రులు ఎవరూ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాలేదు. అయితే ఆ అవకాశం ఉదయ నిధి స్టాలిన్‌కు దక్కడం గమనార్హం.

అనుమతి కోరిన వెంటనే..

రాష్ట్రంలో క్రీడల బలోపేతం, క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ, అంతర్జాతీయ పోటీలకు తమిళనాడును వేదికగా మార్చడం వంటి అంశాలపై ఉదయ నిధి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఉదయ నిధి అనుమతి కోరారు. ఆ వెంటనే పీఎం కార్యాలయం నుంచి అనుమతి లభించడం విశేషం. మంగళవారం సాయంత్రం ప్రధానితో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశం నిమిత్తం ఢిల్లీకి సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఏకే ఎస్‌ విజయన్‌తో పాటు డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అధికార పర్యటనకు ఉదయ నిధి రావడంతో తమిళనాడు భవన్‌లో ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ డీఎంకే వర్గాలతో ఆయన సమావేశమయ్యారు. సాయంత్రం రాష్ట్ర మాజీ గవర్నర్‌, ప్రస్తుత పంజాబ్‌ గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ ఇంటి వేడుకలో పాల్గొన్నారు. ప్రధానితో భేటి సందర్భంగా తమిళనాడులో క్రీడల కోసం రూపొందించిన ప్రత్యేక విజన్‌ను ఉదయ నిధి అందజేయనున్నారు. అలాగే, సీఎం స్టాలిన్‌ తరపున నీట్‌ మినహాయింపు తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. పీఎంతో భేటీ అనంతరం కేంద్ర క్రీడల శాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో ఉదయ నిధి సమావేశం కానున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు