Tamil Nadu: గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

18 Nov, 2023 15:52 IST|Sakshi

తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య రగులుతున్న వివాదం మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్‌ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కార్‌ వర్సెస్‌ గరర్నర్‌ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తాజాగా గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ.. గతంలో తీర్మానించిన 10 బిల్లులను మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ వెనక్కి పంపిన నేపథ్యంలో ఆర్‌ఎన్‌ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు అన్న డీఎంకే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్టాలిన్‌ మాట్లాడుతూ గవర్నర్‌పై నిప్పులు చెరిగారు.

ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ బాధ్యత అని తెలిపారు. అయనకు ఏవైనా సందేహాలు ఉంటే దానిని ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు. గతంలో గవర్నర్ కొన్ని బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రాష్ట్రం వెంటనే స్పందించించి వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. గవర్నర్‌ కోరిన వివరణను ప్రభుత్వం ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదని ప్రస్తవించారు. గవర్నర్‌ వద్ద 12 బిల్లులు పెండింగులో ఉన్నామని, ఎలాంటి కారణం చెప్పకుండా బిల్లులను నిలిపివేయడం తమిళనాడు ప్రజలను అవమానించడం, రాష్ట్ర అసెంబ్లీని అవమానించారని దుయ్యబట్టారు.
చదవండి: వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త

గవర్నర్ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్‌ మండిపడ్డారు. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. అలా కాకుండా రాష్ట్ర పథకాలను ఎలా నిలిపివేయాలనే దాని గురించే గవర్నర్‌ ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకమని విమర్శించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్‌ తిప్పి పంపిన 10  బిల్లులను మరోసారి అసెంబ్లీ  ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజాగా ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్‌ అధికారాలను తగ్గించేలా తీసుకొచ్చిన తీర్మానం, వ్యవసాయం, ఉన్నత విద్య వంటి అంశాలకు చెందినవి ఉన్నాయి. . 

ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్‌ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బిల్లుల విషయంలో గవర్నర్‌లు వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి గత బిల్లులను ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు