మావోయిస్టుల కోసం వేట ముమ్మరం

19 Nov, 2023 01:48 IST|Sakshi
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

ఆస్పత్రులపై నిఘా

సాక్షి, చైన్నె: పశ్చిమ కనుమలలోని కోయంబత్తూరు అటవీ గ్రామాలలో మావోయిస్టుల కోసం పోలీసులు, క్యూ బ్రాంచ్‌ అధికారులు వేట మొదలెట్టారు. సరిహద్దుల్లోని ఆస్పత్రులపై నిఘా ఉంచారు. కేరళ రాష్ట్రంలో గత వారం మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు. మరికొందరు తప్పించుకున్నారు. ఇందులో కొందరికి తుపాకీ తూటాలతో గాయాలు ఏర్పడినట్లు వెలుగు చూసింది. దీంతో వీరిని పట్టుకునేందుకు కేరళ పోలీసులు పశ్చిమ కనుమలలో జల్లెడపట్టారు. అయితే మావోయిస్టుల జాడ కానరాలేదు. వీరు తమిళనాడులోని పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవులలోకి ప్రవేశించి ఉండవచ్చు అని లేదా, అటవీ గ్రామాలలో దలదాచుకుని ఉండవచ్చనే అనుమానాలు బయలుదేరాయి. దీంతో కేరళ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. తమిళనాడు పోలీసులు అటవీ గ్రామాల్లో గాలింపును ముమ్మరం చేశారు. శనివారం అటవీ గ్రామాలలో క్యూ బ్రాంచ్‌ అధికారులు తిరుగుతూ అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నారా? అని ఆరా తీశారు. అనుమానితులు ఎవరైనా కనిపించినా, ఎక్కడైనా తలదాచుకుని ఉన్నా, సమాచారం ఇవ్వాలని అటవీ గ్రామ ప్రజలకు పోలీసులు తమ నంబర్లును ఇచ్చి వెళ్లారు. అలాగే గ్రామాలోని క్లీనిక్‌లపై నిఘా ఉంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరైనా గాయాలతో వచ్చి చికిత్స పొందుతున్నారా? అని తనిఖీలు చేస్తున్నారు. కేరళ నుంచి గ్రామాల గుండా తమిళనాడుకు వచ్చే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు సోదాలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు.

మరిన్ని వార్తలు