వేగంగా 150 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పనులు | Sakshi
Sakshi News home page

వేగంగా 150 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పనులు

Published Sun, Nov 19 2023 1:48 AM

వైద్య శిబిరంలో సూచనలు చేస్తున్న మంత్రి  - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో కొత్తగా 150 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1000 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగో వారంగా జరిగిన ఈ శిబిరాన్ని మైలాపూర్‌లోని నొచ్చికుప్పంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ, వర్షాల సీజన్‌ నేపథ్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు అనూహ్య స్పందన వస్తున్నట్లు తెలిపారు. గత మూడు వారాలలో లక్షలాది మంది వైద్యశిబిరం ద్వారా సేవలను పొందినట్లు పేర్కొన్నారు. చైన్నెలో ఓ మండలానికి మూడు చొప్పున 15 మండలాలకు 45 శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో డెంగీ కేసులు కట్టడిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డెంగీ బారిన 6,777 మంది పడ్డారని, ఇందులో 564 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. శుక్రవారం 52 కేసులు నమోదైనట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలో ఉన్న వారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇన్‌ప్లూయాంజా వైరస్‌ ప్రభావంపై దృష్టి పెట్టామని, తీవ్ర జ్వరంతో వచ్చే వారికి పరిశోధనలు జరిపే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే 500 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ద్వారా సేవలను అందిస్తున్నామని, అదనంగా మరో 150 సెంటర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. త్వరలో వీటిని సీఎం స్టాలిన్‌ ప్రారంభిస్తారన్నారు. ఈ హెల్త్‌ సెంటర్లకు సిబ్బంది నియామక పనులు చేపట్టామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఆర్మీ కోసం క్రోం పేటలో

డ్రోన్ల తయారీ

సాక్షి, చైన్నె: భారత ఆర్మీ కోసం చైన్నె శివారులోని క్రోంపేటలోని ఎంఐటీలో డ్రోన్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే 500 డ్రోన్లను సిద్ధం చేసి ఆర్మీకి ఇక్కడి బృందం పంపించింది. ఎంఐటీలోని అబ్దుల్‌ కలాం పరిశోధన కేంద్రంలో ఈ డ్రోన్లను సిద్ధం చేయడం విశేషం. ఈ డ్రోన్ల ద్వారా మందులు, ఆహారం వంటి వాటిని సరఫరా చేయడానికి వీలుందని ఎంఐటీ వర్గాలు పేర్కొన్నాయి. 20 కి.మీ దూరం వరకు ఒక్కో డ్రోన్‌ ప్రయాణించగలదని, ఇందులో ఈ మేరకు చార్జింగ్‌ బ్యాటరీలు, జీపీఎస్‌ తదితర అన్ని రకాల పరికరాలను అమర్చినట్లు వివరించారు.

హెల్మెట్‌ ధరించకుండా

బైక్‌ డ్రైవింగ్‌

హీరో ధనుష్‌ కొడుకుకి రూ.1000 జరిమానా

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య, నటుడు ధనుష్‌ 2004లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి యాత్ర, లింగం అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా మనఃస్పర్థలు కారణంగా ధనుస్‌, ఐశ్వర్య విడిపోయారు. కాగా ధనుష్‌ పెద్ద కొడుకు వయసు 17 సంవత్సరాలు. ఇలాంటి పరిస్థితుల్లో యాత్ర బైక్‌ టైనర్‌తో కలిసి స్థానిక పోయెస్‌ గార్డెజన్‌ రోడ్డులో ఆర్‌.25 అనే ఆధునిక బైక్‌ను హెల్మెట్‌ కూడా ధరించకుండా నడిపాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ట్రాఫిక్‌ పోలీసు అధికారి నిబంధనలను అతిక్రమించి బైక్‌ నడిపిన యాత్ర వ్యవహారంపై నటుడు ధనుష్‌ను కలిసి ఆయన కొడుకు సేఫ్టీ కోసం హెల్మెట్‌ కూడా ధరించని విషయాన్ని వివరించి రూ.1000 జరిమానా విధించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

1.8 కోట్ల విలువైన

మత్తు పదార్థాలు సీజ్‌

తిరువొత్తియూరు: చైన్నె తాంబరం సమీపంలో కళాశాల విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1.8 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తాంబరం ఓఎంఆర్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు, ట్రిప్లికేన్‌, మైలాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులకు మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్టు తాంబరం, శంకర్‌ నగర్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తాంబరం ప్రాంతానికి చెందిన సూర్యమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. విచారణలో అతను కొడుంగయూరుకు చెందిన యునెస్‌ నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి చైన్నె జామ్‌ బజార్‌కు చెందిన మహమ్మద్‌ రఫీక్‌ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సూర్యమూర్తి వద్ద నుంచి రూ. 1.80 కోట్ల విలువైన 5.8 కిలోల మెటా బెటమిన్‌ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. తర్వాత నిందితుడిని అరెస్టు చేసి మహమ్మద్‌ రఫీక్‌, యునెస్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement