వర్షాకాల సమస్యలపై అప్రమత్తంగా ఉండండి

28 Jun, 2023 05:33 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ, పురపాలికల్లో వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలంలో ప్రజలు ఎదుర్కొ­నే సమస్యలపై మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తం­గా ఉండాలని పురపాల­క శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా మునిసిపాలిటీలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికలతోపాటు హైదరాబాద్‌లో తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల  ప్రథమ ప్రాధాన్యత అని, ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్‌ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సన్నద్దంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ  సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు, వాటి పరిష్కారం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.   

>
మరిన్ని వార్తలు