కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు:కేటీఆర్

3 Dec, 2023 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తాము ఆశించిన ఫలితం రాలేదని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆశించిన ఫలితం రానందుకు నిరాశగా ఉందని అన్నారు. అయితేనేం.. ప్రజల కోసం ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని వెల్లడించారు. గత 23 ఏళ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నామని అన్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. ఎదురుదెబ్బను గుణపాఠంగా భావిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతామని స్పష్టం చేశారు. ఓటమికి కుంగిపోం.. గెలుపునకి పొంగిపోం.. అని కేటీఆర్ అన్నారు.

'కాంగ్రెస్ వేవ్ అయితే.. అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రావాలి. కానీ అలా జరగలేదు. సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్‌కు సాధారణ మెజార్టీనే వచ్చింది. ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యాలన్ని కలిగించాయి. ప్రజల మన్నన పొంది మరింత బలంగా తిరిగొస్తాం. ఇది ‍స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మరిన్ని మార్పులతో మళ్లీ ముందుకు వస్తాం' అని కేటీఆర్ అన్నారు.

గత పదేళ్లలో తమకు సహకరించిన ప్రభుత్వ   ఉద్యోగులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని కేటీఆర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయబోం.. వారు కూడా కుదురుకోవాలని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు చాలా మంది ఓడిపోయారని పేర్కొన్నారు.

ప్రజా తీర్పును గౌరవించి సీఎం కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇప్పటికే ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు