నిత్యం మురుగు పరుగు

9 Jun, 2023 05:07 IST|Sakshi

నగరంలో ఉప్పొంగుతున్న డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు

కంపుకొడుతున్న రోడ్లు

ఫిర్యాదు చేస్తే కానీ పట్టించుకోని  జలమండలి సిబ్బంది    

సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహా నగరంలో డ్రైనేజీల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. సగం వరకు పగిలి, సరిగ్గా మూతల్లేని, చెత్తాతో నిండిన మ్యాన్‌హోళ్ల నుంచి నిత్యం మురుగు నీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.

కాలనీల్లోనే కాదు... నిత్యం రద్దీగా ఉండే  ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది.  జలమండలి యంత్రాంగం, డ్రైనేజీ పైప్‌లైన్ల, మ్యాన్‌హోల్స్‌ మరమ్మతులు, నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్నా... మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డా  డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి ముగురు నీరు ఇళ్లలోకి వస్తుండగా, కొన్నిచోట్ల తాగునీటి పైప్‌లోకి మురుగు వస్తోంది.  

నిత్యం సమస్యలే.. 
మహానగరంలో మ్యాన్‌హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.

ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు  వస్తుంటాయి. చిన్న వర్షం పడితే  ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరుగడం సాధారణంగా తయారైంది. ఎక్కడ చూసినా.. ఇవే సమస్యలు. నగరంతోపా టు శివార్లలో సైతం మ్యాన్‌హోళ్ల పరిస్ధితి అధ్వానంగా తయారైంది. ప్రతిచోట మ్యాన్‌హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్ట సాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కానీ, స్పందించని పరిస్థితి ఉంది. 

12 వేల చదరపు కిలో మీటర్ల మురుగు నీటి వ్యవస్థ... 
మహానగరంలో సుమారు 12 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మురుగు నీటి వ్యవస్థ విస్తరించి ఉంది. వీటిపై సుమారు నాలుగు లక్షల వరకు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో లక్ష వరకు మ్యాన్‌హోళ్లు ఉంటాయన్నది అంచనా. వీటిలో సుమారు 20 వేలకు పైగా లోతైనవి ఉంటాయి. నగరంలోని సుమారు 450 ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్న వర్షానికే పొంగిపర్లుతుంటాయి. మరోవైపు వ్యర్థాలు, చెత్తా పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మ్యాన్‌హోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది.  

నిజాం కాలం నుంచే.. 
నిజాం కాలం నుంచే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్ధ కొనసాగుతోంది. అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్‌ పైపులైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్‌తో నిర్మాణాలు చేపట్టారు.

అయితే అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా 25 రెట్లు పెరిగినా పాత కాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది.  పైప్‌లైన్లను కొన్ని ప్రాంతాల్లో రీస్టోర్‌ చేసినా.. క్లీనింగ్‌ యంత్రాలతో మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండటంలేదు.  

తాగునీటి పైపుల్లోకి.. 
కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీలు దెబ్బతిని లీకవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. పాతబస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుçవడంతో మంచినీరు కలుషితమవుతోంది. సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులిపేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు