రాష్ట్ర ఎమ్మెల్యేల్లో  106 మంది  కోటీశ్వరులే!

22 Oct, 2023 02:49 IST|Sakshi

రూ.161 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి టాప్‌ 

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదికలో వెల్లడి 

కేటీఆర్‌ ఆస్తులు రూ.41 కోట్లు, అప్పులు రూ.27 కోట్లు 

కేసీఆర్‌ ఆస్తులు రూ.23 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు 

ఈటల రాజేందర్‌ ఆస్తులు రూ.56 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు 

మొత్తంగా 72 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు 

సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణలోని ఎమ్మెల్యేల్లో 90శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది (92%), ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%), ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో నలుగురు (67%), బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు (100%), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువేనని తెలిపింది.

మొత్తంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.13.57 కోట్లు అని వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా తేల్చింది.

రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఖాళీగా ఉంది. ఈ క్రమంలో మిగతా 118 నియోజకవర్గాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేల ఆస్తులు, నేర చరిత్ర తదితర అంశాలపై 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్‌ సంస్థ శనివారం తమ నివేదికను విడుదల చేసింది. బహిష్కరణకు గురైన, పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిక ఖరారుకాని ఇద్దరు ఎమ్మెల్యేలను స్వతంత్రులుగా చూపింది. 

పార్టీలు మారినవారు 16 మంది 
ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో 12 మంది కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారుకాగా, ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలిచారు. వీరంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

గ్రాడ్యుయేట్లు 58 శాతమే.. 

  •      రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలలో.. 43 మంది (36%) విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉంది. మరో 69 మంది (58%) గ్రాడ్యుయేషన్‌/ఆపై విద్యార్హత కలిగి ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా చేశారు. ఒక ఎమ్మెల్యే తాను సాధారణ అక్షరాస్యుడినని ప్రకటించుకున్నారు. 
  • ఎమ్మెల్యేల వయసును పరిశీలిస్తే.. 43 మంది (36%) వయసు 30 నుంచి 50ఏళ్ల మధ్య ఉండగా, 75 మంది (64%) వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది. 
  • మొత్తం 118 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు (5%) మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 

రూ.161 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి టాప్‌ 

  • అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల జాబితాలో.. రూ.161 కోట్లతో నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు–బీఆర్‌ఎస్‌), రూ.91 కోట్లతో పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి–బీఆర్‌ఎస్‌) నిలిచారు. 
  • మంత్రి కేటీఆర్‌కు రూ.41 కోట్లు ఆస్తులు, రూ.27 కోట్లు అప్పులు ఉండగా.. సీఎం కేసీఆర్‌కు రూ.23 కోట్లు ఆస్తులు, రూ.8కోట్లు అప్పులు ఉన్నట్లు గత అఫిడవిట్లలో చూపారు. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో చూపిన అఫిడవిట్‌ ప్రకారం ఆయన ఆస్తులు రూ.56 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు కావడం గమనార్హం. 
  • యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషాఖాద్రీ రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలో తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. 
  • రూ.కోటికిపైగా అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.63 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్‌ ఉన్నారు. 

సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు 
రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిపి ప్రస్తుతమున్న 118 మంది ఎమ్మెల్యేలకుగాను.. 72 మంది (61%)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని.. ఇందులో బీఆర్‌ఎస్‌ వారే 59 మంది అని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. బీఆర్‌ఎస్‌కు ఉన్న 101 మంది ఎమ్మెల్యేల్లో ఇది 58శాతమని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై (86%), ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో నలుగురిపై (67%), బీజేపీకి చెందిన ఇద్దరు (100%) ఎమ్మెల్యేలపై, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరిపై (50%) క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు వారు గత ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని వివరించింది.

మొత్తంగా 46 మంది (39%) సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో బీఆర్‌ఎస్‌ వారు 38 మంది అని తెలిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని.. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉందని వివరించింది.

మరిన్ని వార్తలు