అమరవీరుల త్యాగాలు మరువలేం | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలు మరువలేం

Published Sun, Oct 22 2023 2:48 AM

- - Sakshi

ఘనంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఏలూరు టౌన్‌: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేమని, వారు చరిత్రలో నిలిచిపోతారని ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా డీఐజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎస్పీ మేరీ ప్రశాంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పూజ, డీఎఫ్‌ఓ శివశంకర్‌ తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాల్లాడుతూ విధుల్లో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అంతర్గత శత్రువుల నుంచి రక్షణ కల్పించేది పోలీసులే అన్నారు. డీఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మాట్లాడుతూ.. పోలీస్‌ ఉద్యోగమంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధి, అంకితభావం, త్యాగానికి నిదర్శనమన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ నిత్యం తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ అందించిన సేవలకు దేశంలో ఉత్తమ పోలీస్‌గా నిలిచారని ప్రశంసించారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ కరణంకుమార్‌, అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ శేఖర్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, ఏఆర్‌ ఆర్‌ఐ పవన్‌కుమార్‌, ఏలూరు ట్రాఫిక్‌ సీఐ వరప్రసాద్‌, ఏలూరు దిశ సీఐ విశ్వం, ఎస్‌బీ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్‌బీ సీఐ దుర్గాప్రసాద్‌, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

భారీ ర్యాలీ : పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి భారీ ర్యాలీని డీఐజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ, అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఏలూరు అమీనాపేట నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సెంటర్‌, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, ఎన్‌ఆర్‌పేట, జెడ్పీ కార్యాలయం కలెక్టరేట్‌ మీదుగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు ర్యాలీ చేరుకుంది. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో భారీ మానవహారం చేపట్టారు.

1/1

Advertisement
Advertisement