11 ఏళ్లకే దొంగతనం.. చెట్టుతొర్రలో ఇరుక్కుని..

6 Apr, 2021 08:47 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌ రూరల్‌: ఆలయంలో నగదు చోరీ చేసిన ఓ మైనర్‌ బాలుడు.. తిరిగి ఆలయం నుంచి బయటకు వస్తూ చెట్టుతొర్రలో ఇరుక్కుపోయాడు. ఆలయ పూజారి వచ్చి గమనించి ఆ బాలుడిని పట్టుకున్నాడు. శంషాబాద్‌ మండలం ఇందిరానగర్‌ దొడ్డి ప్రాంతానికి చెందిన బాలుడు(11) సోమవారం మధ్యాహ్నం ఘాంసిమియాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఆలయంలోకి  భక్తుడిలా వచ్చాడు. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని గుడిలోపలికి వెళ్లాడు. అయితే  పూజలు చేస్తున్నట్లుగా నటించి ఏకంగా ఆలయం లోపల టేబుల్‌ ఖానాలో దాచి ఉంచిన రూ.10వేలను తస్కరించాడు. తిరిగి అదే చెట్టు తొర్రలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ అందులో ఇరుక్కుపోయాడు.

అయితే, కొద్దిసేపటి తర్వాత ఆలయానికి వచ్చిన పూజారికి టేబుల్‌ ఖానాలోని నగదు కనిపించలేదు. దీంతో ఆయన స్థానికులతో కలిసి సీసీ పుటేజ్‌ను పరిశీలించగా.. బాలుడు ఆలయంలోకి వచ్చి చెట్టుతొర్రలోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడు అందులోనే ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలుడి నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ బాలుడు సెల్‌పోన్‌ దొంగతనం సంఘటనలో నిందితుడుగా ఉన్నట్లు సీఐ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్‌ విద్యార్థి..

మరిన్ని వార్తలు