నిందితులకు రిమాండ్‌

30 Oct, 2022 01:05 IST|Sakshi
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్న పోలీసులు

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఆ ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు 

చంచల్‌గూడ జైలుకు తరలింపు 

అంతకుముందు పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా నిందితులకు హైకోర్టు ఆదేశం 

సరెండర్‌ కాని పక్షంలో పోలీసులు అరెస్టు చేయొచ్చని వెల్లడి 

ఇటీవలి ఏసీబీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేత 

రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అరెస్టు చేసిన పోలీసులు 

ముగ్గురి స్టేట్‌మెంట్లు రికార్డు  

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు 

అనంతరం ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు  

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ (ఏ–1), నందకుమార్‌ (ఏ–2), సింహయాజీ స్వామి (ఏ–3)లను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ వారు లొంగిపోని పక్షంలో పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలిపింది. ఈ నెల 27వ తేదీన ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఇంట్లో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు  ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ..
ఈనెల 26న రాత్రి మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే భౌతికంగా నగదు పట్టుబడకపోవటంతో పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టును జడ్జి తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ సీహెచ్‌ సుమలత విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్, నిందితుల తరఫున న్యాయమూర్తి ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. 

నిందితుల వెనుక పెద్దలెవరో నిగ్గు తేల్చాల్సి ఉంది: ఏజీ 
‘ఎమ్మెల్యేలకు ఎర కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్‌ అవసరం. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది.

కిందికోర్టు రిమాండ్‌కు తరలింపునకు ఉత్తర్వులు జారీ చేయకపోవడం చెల్లదు. నిందితులను రిమాండ్‌కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారనేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. నిందితుల ముగ్గురి వెనుక ఉన్న కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిందితులను రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది..’ అని ఏజీ నివేదించారు.  

సివిల్‌ పోలీసులకు దర్యాప్తు అధికారం లేదు.. 
రామారావు వాదనలు వినిపిస్తూ.. ‘ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌కు పంపడం చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పుల ప్రకారం 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిందే. అసలు అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఈ కేసు నమోదు, దర్యాప్తు చేసే అధికారం సివిల్‌ పోలీసులకు లేదు..’ అని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులను లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు లొంగిపోయినా,  పోలీసులు అరెస్టు చేసినా జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోసం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్లు 50–ఏ, 51, 54,55, 56, 57లను పాటించాలని స్పష్టం చేశారు  

నందకుమార్‌ ఇంట్లో అరెస్టు 
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో షేక్‌పేటలోని ఆదిత్యా హిల్‌టాప్‌ అపార్ట్‌మెంట్‌లోని నందకుమార్‌ ఇంట్లో ముగ్గుర్నీ అరెస్టు చేసిన పోలీసులు.. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎదుట హాజరుపరిచారు. కాసేపటి తర్వాత మెయినాబాద్‌ ఠాణాకు తరలించి, మరోసారి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఇక్కడే రిమాండ్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. నిందితులు ఇక్కడ ఉన్నంత వరకు పోలీసులు మీడియాతో పాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల తర్వాత తిరిగి మెయినాబాద్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు.

అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో సరూర్‌నగర్‌లోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. నిందితుల ఆరోగ్యం దృష్ట్యా రిమాండ్‌కు అనుమతించొద్దని వారి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు అయ్యేందుకు వాహనం ఎక్కిన నిందితుల ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులకు సింహయాజి చెయ్యి ఊపుతూ టాటా చెప్పారు.  

మునుగోడు ఎన్నికల తర్వాతే కస్టడీ.. 
కేసు తదుపరి దర్యాప్తును మునుగోడు ఎన్నికల తర్వాతే చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని భావించిన సైబరాబాద్‌ పోలీసులకు బ్రేక్‌ పడినట్లయింది. నవంబర్‌ 4 తర్వాత కస్టడీ పిటిషన్‌ను సిద్ధం చేస్తామని, కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఫామ్‌హౌస్‌ సమావేశంపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు నందకుమార్‌ ఏర్పాట్లు చేశారు. కానీ ఈలోగా హైకోర్టు అరెస్టు ఆదేశాలు ఇవ్వటంతో అది జరగలేదు. 

>
మరిన్ని వార్తలు