ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ‘స్టార్‌’.. ఇది దేనికి సంకేతం?

11 Apr, 2022 01:00 IST|Sakshi
ఆదివారం రామన్నపేటలో ఎంపీ కోమటిరెడ్డిని సన్మానిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా ఇచ్చిన ఏఐసీసీ 

ఎన్నికల సమయంలో ఇచ్చే పదవి ఇప్పుడెందుకనే సందేహాలు 

రాష్ట్రమంతా తిరిగేందుకు కోమటిరెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌! 

రెండో అధికార కేంద్రమా?.. పదవి ఇచ్చి బుజ్జగించారా? 

సీనియర్లను సమన్వయం చేసే బాధ్యత ఇచ్చారా? 

కాంగ్రెస్‌ శ్రేణుల్లో రకరకాల చర్చలు 

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ అధిష్టానం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా ఇవ్వడం కాంగ్రెస్‌ వర్గాలను ఆశ్చర్యానికి చేసింది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరివరకు బరిలో ఉన్న ఆయనకు ఉన్నట్టుండి ప్రత్యేక పదవి కట్టబెట్టడం, అది కూడా ఎన్నికల సమయంలో ఇచ్చే ఈ పదవిని ఇప్పుడు ఇవ్వడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. నిజానికి వెంకటరెడ్డికి ఏఐసీసీలో ఏదైనా పదవి ఇస్తారని, లేదా ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా పంపుతారని ఇప్పటివరకు భావించారు. కానీ రాష్ట్రంలోనే కీలకమైన బాధ్యత అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డికి ఈ పదవి ఇవ్వడం వెనుక అధిష్టానానికి ప్రత్యేకమైన ఆలోచన ఉందని, రాష్ట్రంలో పార్టీ ఏకపక్షంగా ముందుకెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపట్ల వ్యతిరేకంగా ఉన్న ఆయనను ఈ పదవి ఇచ్చి బుజ్జగించారని, తద్వారా పార్టీలో సమస్యలు లేకుండా సర్దుబాటు చేశారనే వాదనా వినిపిస్తోంది. 

సమన్వయం కోసమేనా? 
ఇటీవల రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగేంతవరకు రాష్ట్ర పార్టీ రెండు వర్గాలుగా పనిచేసింది. ఓ వర్గం పూర్తిస్థాయిలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని బలపర్చగా.. మరోవర్గం అంటీముట్టనట్టుగా, ఒకదశలో వ్యతిరేకంగా వ్యవహరించింది. ఈ వర్గంలోని కొందరు నేతలు అప్పుడప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అసమ్మతి వ్యక్తపర్చేందుకు విధేయుల పేరిట సమావేశాలు నిర్వహించడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 40 మంది ముఖ్య కాంగ్రెస్‌ నాయకులను పిలిపించి మాట్లాడడం ద్వారా రాహుల్‌గాంధీ సమస్యను కొంతవరకు సర్దుబాటు చేయగలిగారు.

ఈ పరిణామాలతో కొందరు పార్టీ సీనియర్లతో సమన్వయం చేసుకోవడం రేవంత్‌కు కష్టమనే భావనకు అధిష్టానం వచ్చిందని.. వారిని సమన్వయం చేసే బాధ్యత కోమటిరెడ్డికి అప్పగిస్తూ, స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా కల్పించిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఇక పార్టీ కార్యక్రమాల నిర్వహణలో రేవంత్‌తోపాటు మరో కీలక నేతకూ భాగం కల్పించాలన్న ఉద్దేశంతోనే కోమటిరెడ్డిని ముందుకు తెచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. తద్వారా పార్టీలో రెండో అధికార కేంద్రం ఉందనే భావన కలుగుతుందని, ఇది అసమ్మతిని తీవ్రం కానివ్వదనే ఆలోచన కూడా పార్టీ అధిష్టానానికి ఉన్నట్టు నేతలు అంటున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా వల్ల ఎంపీ కోమటిరెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించి సభలు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని.. ఇందుకు అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందని చెబుతున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా.. : కోమటిరెడ్డి 
నల్లగొండ/రామన్నపేట: శ్రీరామనవమి రోజున తనను పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించడం సంతోషకరమని, ఇది దేవుడి దీవెన అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలుచోట్ల శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు నల్లగొండకే తన పోరాటాన్ని పరిమితం చేశానని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఎలా నాశనం చేస్తున్నారో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తానని తెలిపారు.

కాంగ్రెస్‌ హయాంలో దళితులకు భూములిస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం వాటిని లాక్కొని రియల్‌ ఎస్టేట్‌కు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూస్వాములను ఆదుకుంటోందని విమర్శించారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, పూర్వ వైభవం తెస్తానని ప్రకటించారు.  

మరిన్ని వార్తలు