అంబర్‌పేట్‌ తహశీల్దార్‌ ఆఫీసు: క్షణ క్షణం.. భయం భయం

24 Aug, 2021 15:27 IST|Sakshi

శిథిలావస్థలో అంబర్‌పేట తహశీల్దార్‌ కార్యాలయం  

రేకుల షెడ్డులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 

ఫైళ్లకు రక్షణ కరువు  

అంబర్‌పేట: అంబర్‌పేట తహశీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. పాత భవనంలో తహశీల్దార్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన భవనంలో ఇప్పటికీ తహశీల్దార్‌ కార్యాలయం కొనసాగుతుండటంతో అటు సిబ్బంది, ఇటు పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తహశీల్దార్‌ కార్యాలయం మాత్రం మారడం లేదు. శిథిల భవనంలో సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం వందలాది పౌరులకు, వివిధ సేవలు అందించే కార్యాలయం సౌకర్యవంతంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఉదయం కార్యాలయం ప్రారంభం కాగానే వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురవుతున్నారు. కార్యాలయ ఆవరణలో రేకుల షెడ్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, శిథిల భవనంలో తహశీల్దార్‌తో పాటు డిప్యూటీ తహశీల్దార్‌ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్లు సైతం ఇదేం కార్యాలయం అన్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా తహశీల్దార్‌ కార్యాలయాన్ని పునర్నిర్మించాలని పలువురు కోరుతున్నారు.  

అమలుకు నోచుకోని హామీలు  
తహశీల్దార్‌ కార్యాలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో హామీలు, ప్రకటనలు ఇచ్చారే తప్ప ఇప్పటివరకు అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజక వర్గంతో పాటు మలక్‌పేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. నిత్యం ఆ దాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఆసరా పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు అమలు చేసే కీలకమైన తహశీల్దార్‌ కార్యాలయం అధ్వానంగా ఉండటంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యాలయానికి వచ్చి పోతుంటారే తప్ప పునర్‌ నిర్మించేందుకు చొరవ తీసుకోకపోవడం గమనార్హం.

అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలందిస్తున్నాం 
తహశీల్దార్‌ కార్యాలయం పునర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే నిధులు విడుదల కాగానే మొదటి ప్రాధాన్యతలో భాగంగా కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈవిషయంపై ప్రత్యేక  దృష్టి సారించారు. ప్రస్తుతం విధులు నిర్వహించేందుకు అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.  – వేణుగోపాల్, అంబర్‌పేట తహశీల్దార్‌  


కార్యాలయ ఆవరణలోప్రమాదకరంగా ఎండిన చెట్టు 

మరిన్ని వార్తలు