హాస్టల్‌లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్‌ గ్రూపుల్లో ఫొటోలు వైరల్‌

21 Apr, 2022 09:39 IST|Sakshi

ఆలస్యంగా వెలుగులోకి..

విచారణకు ఆదేశించిన జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి 

దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్‌ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్‌ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు.

స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్‌ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్‌తోపాటు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్‌ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్‌ బీసీ డెవలప్‌మెంట్‌ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్‌ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు.
(చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్‌ మెసేజ్‌ పెట్టాడని..)

ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..?
వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్‌మెన్‌ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్‌ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్‌ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. 
(చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్‌! అలా అయితే ఎలా?)

మరిన్ని వార్తలు