సంక్షేమ హాస్టళ్లు ఇక మరింత క్షేమం 

9 Sep, 2023 02:36 IST|Sakshi

భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి  

అమలులోకి ‘సమగ్ర ప్రామాణిక ఆపరేటివ్‌ విధానం’ 

రాష్టంలోని 3,783 వసతి గృహాల్లో పటిష్టంగా ప్రభుత్వం కార్యాచరణ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టల్స్‌)లో విద్యార్థులు మరింత క్షేమంగా ఉండేలా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.

హాస్టళ్లలో ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ‘సమగ్ర ప్రామాణిక ఆపరేటివ్‌ విధానం (ఎస్‌ఓపీ)ని అమలులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్‌ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది.

అవసరమైన మార్గదర్శకాలను అన్ని సంక్షేమ శాఖలకు ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా హాస్టళ్లను పర్యవేక్షించేలా క్యాలెండర్‌ (టైమ్‌ టేబుల్‌)ను నిర్దేశించింది. వసతి గృహాల్లో విద్యార్థులకు రక్షణ, భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలోను అప్రమత్తం చేసింది. సురక్షితమైన ఆహారం, నీరుతోపాటు ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. హాస్టళ్ల పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్న పక్షంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.   

మార్గదర్శకాలు ఇవీ.. 
► వసతి గృహాలకు నిరంతరం అందుబాటులో ఉండేలా సిబ్బంది స్టాఫ్‌ క్వార్టర్స్‌లో ఉండాలి. ఒకవేళ క్వార్టర్స్‌ అందుబాటులో లేకపోతే సమీపంలోనే నివాసం ఉండాలి.  
► అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి సంబంధిత ఉద్యోగులు పూర్తి చిరునామాలు, ప్రత్యామ్నాయ ఫోన్‌ నంబర్లను హాస్టల్‌ రిజిస్టర్, నోటీస్‌ బోర్డుల్లో ఉంచాలి. 
► జాబ్‌ చార్ట్‌లోని విధుల పట్ల అలక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.  
► క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కచ్చితంగా హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలి.  
► అధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు, వ్యవస్థాపకులు ఎవరైనా హాస్టళ్లను సందర్శించినప్పుడు వారి వివరాలు, చర్చించిన అంశాలను విజిటర్స్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి.  
► విద్యార్థులకు భోజన మెనూ, సౌకర్యాలు, కిచెన్‌ గార్డెన్, మరుగుదొడ్ల నిర్వహణ, సురక్షితమైన మంచినీరు, మెస్‌ కమిటీ, పేరెంట్స్‌ కమిటీ వంటి కీలక విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. 
► ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సక్రమంగా వినియోగించుకుని ప్రతి నెల రెండో శనివారం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించాలి.  
► వారానికి ఒకసారి వైద్య ఆరోగ్య సిబ్బంది స్వయంగా హాస్టల్‌ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు