మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ!

23 Oct, 2023 04:51 IST|Sakshi

7వ బ్లాక్‌లోని 20వ పియర్‌కు పగుళ్లు..

రెండు, మూడు ఫీట్ల మేర కుంగిపోయిన రోడ్డు

వంతెనపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేత

మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్న ఇంజనీర్లు

బ్యారేజీని ఖాళీ చేశాక ఘటనా స్థలంలోక్షుణ్నంగా పరిశీలన: ఈఎన్సీ వెంకటేశ్వర్లు

ప్రస్తుతానికి బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని వివరణ

ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తుందని వెల్లడి

నేడు బ్యారేజీని సందర్శించనున్న కేంద్ర డ్యాం సేఫ్టీ బృందం

కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది.

వంతెనపై సైడ్‌ బర్మ్‌ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఘటన జరిగిన వెంటనే సాగునీటిశాఖ అధికారులు, ఇతర నిపుణులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్ధ మేనేజర్‌ సురేశ్‌కుమార్‌ తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గితే ప్రమాదమేంటి? దానికి కారణమేంటి? అన్నది తెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉన్నట్టుండి నీటిని వదలడంతో గోదావరిలో, తీరం వెంట మేపుతున్న గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయని.. వ్యవసాయ మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు.

వంతెనపై రాకపోకలు నిలిపివేత
బ్యారేజీ వంతెనపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య రాకపోకలను శనివారం రాత్రి నుంచే నిలిపివేశారు. బ్యారేజీ వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా మట్టిపోసి, బారికేడ్లు పెట్టి ఎవరూ రాకుండా చూస్తున్నారు. కుంగిన ప్రాంతం వద్దకు వెళ్లడానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లు బ్యారేజీని పరిశీలించడానికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. తొలుత వారిని అడ్డుకున్న పోలీసులు తర్వాత బ్యారేజీ పరిశీలనకు అనుమతించారు.

బ్యారేజీకి ప్రమాదం లేదు
మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించాక ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్‌అండ్‌టీ సంస్థ మేనేజర్‌ సురేశ్‌కుమార్‌ తదితరులు మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పెద్ద శబ్ధం వచ్చిందని, ఇంజనీర్లు వెళ్లి పరిశీలించగా బ్యారేజీ పియర్‌ కుంగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ దెబ్బతిన్నదని.. అయితే పక్కన ఉన్న పియర్లపై దీని ప్రభావం ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని.. నెలన్నర రోజుల్లో పూర్వ స్థితికి వస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం బ్యారేజీ నిర్వహణ బాధ్యతను ఎల్‌అండ్‌టీ సంస్థ చూస్తోందని.. ప్రస్తుతం మరమ్మతుల బాధ్యతనూ చేపడుతుందని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో బ్యారేజీలోని నీటిని ఖాళీ చేస్తామని.. కుంగిన చోట ఏం జరిగింది? సరిచేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది తేల్చుతామని వివరించారు. ఈ ఘటనలో దుష్ట శక్తుల హస్తం ఏదైనా ఉందో, లేదో తెలుసుకునేందుకు మహదేవపూర్‌తోపాటు మహారాష్ట్ర వైపు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు.

ప్రపంచ రికార్డు వేగంతో నిర్మాణం
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గోదావరి నదిపై రూ.1,849 కోట్ల వ్యయంతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీని నిర్మించారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ కేవలం 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది.

బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు, దీనికి 87 హైడ్రో మెకానికల్‌ రేడియల్‌ గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటీ 110 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించిన పియర్స్‌ (గేట్ల మధ్య పిల్లర్లలా ఉండే కాంక్రీట్‌ నిర్మాణం) మధ్య ఈ గేట్లను అమర్చారు. బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఒకదశలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నిర్మాణ సంస్థ తమ వెబ్‌సైట్లో పేర్కొనడం గమనార్హం.

నేడు మేడిగడ్డకు డ్యాం సేఫ్టీ బృందం
బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని ‘సెంట్రల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ నిపుణుల బృందం సోమవారం పరిశీలన జరపనుంది. కుంగిన ప్రాంతాన్ని సందర్శించి జరిగిన నష్టంపై అంచనా వేయనుంది. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా మరమ్మతు పనులు చేపడతారు. వాస్తవానికి బ్రిడ్జిలు, బ్యారేజీలను బ్లాకులుగా నిర్మిస్తారు. పునాదుల పరంగా ఒక బ్లాక్‌కు మరో బ్లాక్‌తో సంబంధం ఉండదు. దీనివల్ల ఏదైనా బ్లాక్‌లో విపత్తు/ప్రమాదం ఎదురైతే మొత్తం బ్రిడ్జి/బ్యారేజీ దెబ్బతినకుండా సదరు బ్లాక్‌ వరకే నష్టం పరిమితం అవుతుంది.

మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా నిర్మించారు. తెలంగాణ వైపు నుంచి వాటికి నంబరింగ్‌ ఇచ్చారు. అలా మహారాష్ట్ర వైపు చివరన ఉన్నది ఏడో బ్లాక్‌. దీనిలోని 20వ నంబర్‌ పియర్‌ ప్రస్తుతం కుంగిపోయింది. దీని ప్రకారం ఏడో బ్లాక్‌ వరకు నష్టం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని.. పునాదికి నష్టం జరిగితే ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐదేళ్ల ‘డిఫెక్ట్‌ లయబిలిటీ (లోపాలుంటే సరిచేయా­ల్సిన బాధ్యత)’ సమయం ఇంకా పూర్తి కానందున.. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీనే మరమ్మతుల వ్యయం భరించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వచేసే అవకాశం ఉండదని అంటున్నాయి.

మరిన్ని వార్తలు