పాత బంగారం మార్చుకుంటున్నారా?

23 Oct, 2023 04:52 IST|Sakshi

ఆభరణం కోసమా.. పెట్టుబడి కోసమా?

రెండింటికీ ఒక్కటే విధానం అనుకూలం కాదు

అవసరమైతేనే కొత్త ఆభరణంతో మార్పిడి

ఈ సమయంలో తయారీ, పన్నుల రూపంలో నష్టం

పెట్టుబడి దృష్ట్యా మెరుగైన ప్రత్యామ్నాయాలు  

పండుగలు అంటే కేవలం ఖర్చు చేయడమే కాదు.. భవిష్యత్‌కు ‘బంగారు’బాట వేసుకోవడం కూడా. నచ్చిన గృహోపకరణాలు, గ్యాడ్జెట్లు కొనే వారు, అందులో కొంత ఆదా చేసి భవిష్యత్‌ కోసం ఎందుకు ఇన్వెస్ట్‌ చేసుకోకూడదు? ఇలా ఆలోచించే కొందరు పండుగ సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం కేవలం అందాన్ని పెంచే ఆభరణం మాత్రమే కాదు, విలువను పెంచే ఆస్తి. అస్థిరతల్లో ర్యాలీ చేసే పెట్టుబడి సాధనం. కనుక పండుగ సమయాల్లో విలువ తరిగిపోయే వాటి కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టేవారు.. పసిడికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన.

గడిచిన కొన్నేళ్లలో బంగారం కొనుగోలు ఎన్నో మార్పులను సంతరించుకుంది. 20 ఏళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టే వారు అరుదుగా కనిపించేవారు. తర్వాత కాలంలో ఇందులో స్పష్టమైన మార్పు కనిపించింది. ముఖ్యంగా గడిచిన పదేళ్ల కాలంలో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా అర్థం చేసుకోవడం పెరిగింది. గతంలో బంగారంపై పెట్టుబడి అంతా భౌతిక రూపంలోనే ఉండేది. ఇప్పుడు సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్, గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

అయినా, ఇప్పటికీ పెట్టుబడి దృష్ట్యా భౌతిక బంగారానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ధంతేరస్‌ (ధనత్రయోదశి) వంటి ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు నమోదవుతుంటాయి. ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యే ఆస్తుల్లో బంగారానికి మొదటి స్థానం ఉంటుంది. నేటితరం పాత బంగారాన్ని, కొత్త ఆభరణాలతో మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి పాత బంగారం మారి్పడితో కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం సరైనదా..? ఆభరణాలను పెట్టుబడిగా చూడొచ్చా? పెట్టుబడి కోసం ఏ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం మెరుగు? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలను ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.  

బంగారం మార్పిడి విధానం..?
పాత బంగారు ఆభరణాలను మార్చుకోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. మార్కెట్లోకి వచ్చే కొత్త డిజైన్ల పట్ల ఆసక్తి ఏర్పడొచ్చు. పాత నగలు డ్యామేజ్‌ కావొచ్చు. లేదంటే కొత్త ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి బడ్జెట్‌ లేక పాత వాటిని మార్చుకోవచ్చు. కారణం ఏదైనా.. పాత బంగారం మార్చుకునే క్రమంలో కొంత నష్టపోతున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పాత బంగారం ఆభరణాల మార్పిడికి సంబంధించి మన దేశంలో ప్రామాణిక విధానం అంటూ లేదు. వర్తకుల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది.

ఆభరణం కొనుగోలు చేసిన వర్తకుడి వద్దే దాన్ని మార్చుకోవడం వల్ల గరిష్ట విలువను తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. హాల్‌మార్క్‌ ఆభరణాలు అయితే బంగారం మార్కెట్‌ ధర మేర విలువను పొందొచ్చు. అయినా కానీ, ఆభరణాల తరుగు–తయారీ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. బంగారం ధరలో 10–20 శాతం వరకు తరుగు, తయారీ చార్జీలను జ్యుయలరీ సంస్థలు వసూలు చేస్తున్నాయి. పాత ఆభరణాన్ని మార్చుకున్నప్పుడు అందులో తరుగు–తయారీ రూపంలో కొంత నష్టం ఏర్పడుతుంది. తిరిగి నూతన ఆభరణం కొనుగోలు చేయడం వల్ల, దాని తరుగు–తయారీ చార్జీల రూపంలో అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది.

 కొనుగోలు చేసిన వర్తకుడి నుంచి కాకుండా, వేరొక చోట పాత ఆభరణాన్ని మార్చుకునేట్టు అయితే ప్రక్రియ వేరుగా ఉంటుంది. వర్తకులు కొందరు కొన్ని అంశాల్లో ఏకరూప విధానాన్ని అనుసరిస్తుంటే, కొన్నింటి విషయాల్లో సొంత ప్రక్రియలను అమలు చేస్తున్నారు. పాత బంగారం ఆభరణాన్ని కరిగించి, స్వచ్ఛత చూసిన తర్వాత, కొత్త ఆభరణంతో మార్చుకోవడానికి చాలా సంస్థలు అనుమతిస్తున్నాయి. ‘‘డిజిటల్‌ స్కేల్‌ సాయంతో బంగారం ఆభరణం బరువు చూస్తారు. దీని ఆధారంగా స్వచ్ఛతను బట్టి ధర నిర్ణయిస్తారు.

సాధారణంగా అనుసరించే స్వచ్ఛతలు 24 క్యారట్‌ (99.9 శాతం స్వచ్ఛత), 22 క్యారట్‌ (91.6 శాతం స్వచ్ఛత), 18 క్యారట్‌ (75 శాతం స్వచ్ఛత). కొందరు జ్యుయలర్లు స్క్రాచ్‌ (గీయడం), యాసిడ్‌ టెస్ట్‌ ద్వారా బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంటారు’’అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కమోడిటీస్‌ హెడ్‌ హరీశ్‌.వి తెలిపారు. అన్నింటికంటే  ప్రామాణికమైనది హాల్‌మార్క్‌ స్వచ్ఛత విధానం. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) హాల్‌మార్క్‌ సరి్టఫికేషన్‌ సేవలు అందిస్తోందని, హాల్‌మార్క్‌ గోల్డ్‌ స్వచ్ఛత పరంగా విశ్వసనీయమైనదిగా హరీశ్‌ పేర్కొన్నారు.

ఇప్పుడు పెద్ద సంస్థలు అయితే క్యారట్‌ను కొలిచే మెషీన్లను ఉపయోగిస్తున్నాయి. వీటినే గోల్డ్‌ అనలైజర్‌ మెషీన్లు అంటున్నారు. అందులో బంగారం లేదా ఆభరణాన్ని ఉంచితే బరువు ఎంత, ప్యూరిటీ ఎంత అనే వివరాలను ప్రదర్శిస్తాయి.  ఉదాహరణకు వడోదరకు చెందిన రీనా దంపతులు ఎదుర్కొన్న అనుభవాన్ని తెలుసుకుంటే పాత బంగారం మారి్పడి ఇప్పుడు ఎంత సులభంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వీరివద్దనున్న 20 గ్రాముల బంగారం చైన్‌ తెగిపోగా, 2014లో మార్చుకుందామని అనుకున్నారు.

ఓ జ్యుయలర్‌ వద్దకు వెళితే, కంటితో చూసి 18 క్యారట్ల బంగారం అని ఖరారు చేసి, రూ.37,500 ధర చెల్లిస్తానని చెప్పాడు. అప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.25,000 స్థాయిలో ఉంది. దీంతో వారు మార్చుకోలేదు. ఇటీవలే అదే చైన్‌ను ఓ వర్తకుడి వద్దకు తీసుకెళ్లగా, గోల్డ్‌ అనలైజర్‌ మెషీన్‌లో పెట్టి చూశారు. 22 క్యారెట్ల ప్యూరిటీ ఉన్నట్టు చూపించింది. దాన్ని కరిగించిన తర్వాత అసలు విలువ చెబుతానని అనడంతో, అందుకు రీనా దంపతులు ఒప్పుకున్నారు. కరిగించిన తర్వాత కూడా 22.1 క్యారెట్‌ నిర్ధారణ అయింది.
దాంతో 10 గ్రాములకు రూ.61,000 చొప్పున విలువ కట్టారు. కొత్త ఆభరణం ధర కూడా అదే రీతిలో ఉండడంతో వారు మార్చుకునేందుకు సమ్మతించారు.

కొత్త ఆభరణాల కొనుగోలు
బంగారం కూడా ఒక ఆస్తే. ఎవరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకైనా ఇది విలువను పెంచుతుంది. ఆభరణం కోసం కొంటున్నారా? లేక పెట్టుబడి దృష్ట్యా కొంటున్నారా? అన్న స్పష్టత అవసరం. భౌతిక బంగారం, ఆభరణాల రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకునేట్టు అయితే తరుగు–తయారీ చార్జీలు, దానిపై జీఎస్‌టీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. స్వచ్ఛతకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. నేడు చాలా జ్యుయలరీ సంస్థలు తమ వద్దే విక్రయిస్తే 100 శాతం విలువను చెల్లిస్తున్నాయి.

ఒకవేళ ఆభరణంతో మార్చుకోకుండా, నగదు కోరితే మొత్తం విలువలో 5 శాతం వరకు తగ్గించి ఇస్తున్నాయి. పన్ను కోణంలో ఇలా చేస్తున్నాయి. ‘‘జ్యుయలరీ అనేది సెంటిమెంటల్‌. మనోభావాలతో ఉంటుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి బదిలీ అవుతుంటుంది. అయితే అధిక తరుగు–తయారీ చార్జీల (10–20 శాతం)తో మార్చుకునేందుకు అయ్యే వ్యయం ఎక్కువ. దీనికితోడు జ్యుయలరీ కోసం స్టోరేజ్, లాకర్‌ చార్జీలను కూడా చెల్లించుకోవాల్సి రావచ్చు.

భౌతిక బంగారం అయినా, ఆభరణాలు అయినా అవి వ్యక్తిగత ఆస్తులు. ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడుల విలువకు తోడు కావు. పెట్టుబడి కోసం అయితే బంగారం కడ్డీలు లేదా కాయిన్లను కొనుగోలు చేయడం కాస్త మెరుగైనది’’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ దిల్షద్‌ బిల్లిమోరియా సూచించారు. అయితే బంగారం కాయిన్లు, కడ్డీలను తిరిగి విక్రయించే సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అంటున్నారు. ‘‘బ్యాంక్‌లు కాయిన్లు, కడ్డీలను విక్రయించడమే కానీ, వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో వీటిని బయట విక్రయించుకోవాల్సి వస్తుంది. తరుగు, కరిగించేందుకు చార్జీలను ఆ సమయంలో వసూలు చేస్తున్నారు’’అని బిల్లిమోరియా
వివరించారు.

ఏమిటి మార్గం..?
ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కాచుకునే చక్కని హెడ్జింగ్‌ సాధనం బంగారం అని నిపుణులు చెబుతున్నారు. బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఎవరి పోర్ట్‌ఫోలియోలో అయినా వైవిధ్యం ఏర్పడుతుందని అంటున్నారు. కాకపోతే పెట్టుబడి దృష్ట్యా అయితే ఆభరణాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నది నిపుణుల సూచన. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, ఎస్‌జీబీలు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం ధరలు ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా సగటున ఏటా 5–11% మధ్య వృద్ధి చెందాయి.

ద్రవ్యోల్బణం పెరిగే సమయంలో గోల్డ్‌ చక్కని హెడ్జింగ్‌ సాధనం. పెట్టుబడుల వైవిధ్యం దృష్టా బంగారం ఒక మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. అయితే అది కడ్డీలు లేదా జ్యుయలరీ రూపంలో ఉండకూడదు’’ అని బిల్లిమోరీ సూచించారు. పీపీఎఫ్, కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు  వంటి సాధనాలు బంగారం మాదిరే వైవిధ్యానికి తోడు, మెరుగైన రాబడి, లిక్విడిటీతో ఉంటాయని చెప్పారు. కనుక పాత బంగారం మార్పి డి అనేది అవసరం ఆధారంగానే నిర్ణయించుకోవాలి.

ఉపయోగించని ఆభరణాలను మార్చుకుని కొత్తవి తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. పెట్టుబడి కోసం అయితే ఆభరణాలకు బదులు నిపు ణులు సూచించిన ప్రత్యామ్నాయాలను పరిశీలించడం మేలు. దీనివల్ల బంగారం విలువలో నష్టపోయే అవకాశం ఉండదు. 2010 వరకు బంగారం విలువ 10 గ్రాములు రూ.15,000 స్థాయిలోనే ఉండేది. కనుక పెట్టుబడుల దృష్ట్యా భౌతిక బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారు. కానీ, నేడు ధర గణనీయంగా పెరిగిపోవడంతో, పెట్టుబడి కోణంలో డిజిటల్‌ బంగారం సాధనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

మరిన్ని వార్తలు