ముదిరిన వివాదం.. తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌ బంద్‌

17 Jan, 2023 00:51 IST|Sakshi

2022–23లో పూర్తిగా సరఫరా నిలుపుదల  

విద్యుత్‌ ధర భారీగా పెరగడమే కారణం  

ధర, బకాయిలపై ఇరు రాష్ట్రాల మధ్య ముదిరిన వివాదం

గత జూన్‌ నాటికి రూ. 3,576 కోట్ల బకాయిలన్న ఛత్తీస్‌గఢ్‌ 

బకాయిలు రూ. 2,100 కోట్లే అంటున్న తెలంగాణ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సరఫరా పూర్తిగా బంద్‌ అయింది. ప్రస్తుత (2022–23) ఆర్థిక సంత్సరంలో ఇప్పటివరకు ఒక్క యూనిట్‌ కూడా ఛత్తీస్‌గఢ్‌ సరఫరా చేయలేదు. ధరతోపాటు బకాయిలను ఛత్తీస్‌గఢ్‌ భారీగా పెంచేయగా, తెలంగాణ డిస్కంలు అంగీకరించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేస్తున్న విజ్ఞప్తులను ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ (సీఎస్‌పీడీసీఎల్‌) నిరాకరిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టంచేసింది.

తెలంగాణ డిస్కంలు, సీఎస్‌పీడీసీఎల్‌ మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కావాల్సి ఉంది. 2020–21లో 39.67శాతం, 2021–22లో కేవలం 1,631 మిలియన్‌ యూనిట్ల (19శాతం) విద్యుత్‌ మా­త్రమే ఛత్తీస్‌గఢ్‌ సరఫరా చేసింది. 2022–23లో పూర్తిగా నిలిపేసింది. తాజాగా ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు.. తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి నివేదించాయి. ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు సద్దుమణిగితే 2022–23 రెండో అర్ధ వార్షికంలో 2,713 ఎంయూల (31%) విద్యుత్‌ సరఫరా జరగొచ్చని అంచనా వేస్తున్నామన్నాయి. 

భారీగా పెంచేసిన ఛత్తీస్‌గఢ్‌ 
2022 జూన్‌ 3 నాటికి బకాయిపడిన రూ.3,576.89 కోట్లను చెల్లిస్తేనే ఒప్పందం మేరకు 1000 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తామని 2022 సెప్టెంబర్‌ 23న ఛత్తీస్‌గఢ్‌ ఇన్వాయిస్‌ పంపింది. అయితే, రూ.2,100 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని అప్పట్లో తెలంగాణ డిస్కంలు బదులిచ్చాయి. తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.90 మాత్రమే చెల్లిస్తామన్నాయి.

అయితే, ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా విద్యుత్‌ కేంద్రం పెట్టుబడి వ్యయం ఆధారంగా ధర చెల్లించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ ఉత్తర్వులతోపాటు పీపీఏ తుది అనుమతులను సవాల్‌ చేస్తూ.. తెలంగాణ డిస్కంలు 2018లో అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ (అప్టెల్‌)లో కేసు వేశాయి.  

ఎంవోయూ ఆధారంగా ఒప్పందం! 
ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 12 ఏళ్లపాటు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు, సీఎస్‌పీడీసీఎల్‌ మధ్య 2015 సెప్టెంబర్‌ 22న ఒప్పందం (పీపీఏ) జరిగింది. టెండర్లకు బదులుగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్‌ 3న జరిగిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఆధారంగా ఈ పీపీఏ జరిగింది. 

నాడు చౌకగా వస్తుందని.. నేడేమో నష్టమని..
ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో రూ.12వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లో విద్యుత్‌ రంగ నిపుణులు రఘు ఈఆర్సీకి వివరించారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌ నుంచి చౌకగానే విద్యుత్‌ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభు­త్వం ఈఆర్సీని కోరింది. తాజాగా ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో మాత్రం రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతోందని తెలంగాణ డిస్కంలు అంగీకరించడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌తో జరగనున్న నష్టంపై నాటి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ టీఎస్‌ఈఆర్సీకి 2016 డిసెంబర్‌లో లేఖ సైతం రాశారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీవేటు వేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పంపింది. ఛత్తీస్‌గఢ్‌ పీపీఏను కొన్ని మార్పులతో అనుమతిస్తూ టీఎస్‌ఈఆర్సీ 2017 మార్చి 31న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  

డిస్కంలకు భారీగా నష్టం 
వివాదాల్లో ఉన్న బకాయిలను అప్టెల్‌ తీర్పునకు లోబడి చెల్లిస్తామని, వివాదాల్లేని బకాయిలను.. లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ రూల్స్‌–2022 ప్రకారం చెల్లిస్తామని డిస్కంలు ఛత్తీస్‌గఢ్‌కు తెలిపాయి. అయినా ఛత్తీస్‌గఢ్‌ అంగీకరించడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నామని డిస్కంలు ఈఆర్సీకిచ్చిన వివరణలో పేర్కొన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను తెచ్చేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఎల్‌)కు చెందిన వార్ధా–డిచ్‌పల్లి–మహేశ్వరం ట్రాన్స్‌మిషన్‌ లైన్‌లో 1000 మెగావాట్ల కారిడార్‌ను 12 ఏళ్ల కోసం తెలంగాణ డిస్కంలు బుక్‌ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంట్‌ రాకపోయినా పీజీసీఎల్‌కు ట్రాన్స్‌మిషన్‌ చార్జీల (ఏటా రూ.400 కోట్లకు పైగా)ను చెల్లించి నష్టపోతున్నామని ఈఆర్సీకి తెలిపాయి. 

మరిన్ని వార్తలు