సర్వమానవ సమానత్వానికే..

3 Feb, 2022 06:12 IST|Sakshi
విష్వక్సేనుడు, సీతారాముల పల్లకీ సేవ ముందు దివిటీతో అర్చకుడు 

వసుదైవ కుటుంబం స్ఫూర్తికే సమతా పండుగ 

సాక్షి, హైదరాబాద్‌: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు.

శంషాబాద్‌లోని ముంచింతల్  ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్‌ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు.  

ఆధ్యాత్మిక  పారవశ్యంలో భక్తులు 
తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు.

అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు   భక్తులలో ఆధ్యాత్మిక  పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది.  

తరలివచ్చిన  స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు  
ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌ స్వామి, రామచంద్ర జీయర్‌ స్వామి, రంగ రామానుజ జీయర్‌ స్వామి, అష్టాక్షరి జీయర్‌ స్వామి, వ్రతధర జీయర్‌ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్‌ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం.  

మరిన్ని వార్తలు