న్యూజిలాండ్‌లో పెళ్లి.. అమెరికాలో హైదరాబాదీ భార్యాభర్తల మధ్య తగాదాలు..

21 Dec, 2022 09:25 IST|Sakshi

సాక్షి,. హైదరాబాద్‌: తల్లిదండ్రుల మధ్య తగాదాలు కన్న కొడుకుకు కష్టాలు తె‍చ్చిపెట్టాయి. సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌ఓ ఏడుకొండలు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు, స్నేహపురికాలనీకి చెందిన సరెం శ్రీనివాస్, అత్తాపూర్‌కు చెందిన తరుణంనాజ్‌ వేర్వేరుగా న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2015 నవంబర్‌ 6న న్యూజిలాండ్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఉద్యోగరీత్యా ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ప్రస్తుతం రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇండియాలో ఉంటున్న ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో తరుణంనాజ్‌ అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం కొడుకును తల్లి వద్ద ఆరు రోజులు, తండ్రి వద్ద ఒక రోజు ఉండేలా తీర్పునిచ్చింది. తల్లి దగ్గర ఆరు రోజులు ఉన్న అనంతరం ఏడో రోజు బాబు తండ్రి దగ్గరికి చేరాడు. ఆ ఒక్కరోజు సమయంలోనే శ్రీనివాస్‌ కుమారుడిని తీసుకుని ఇండియాకు వచ్చేశాడు.

ఒక రోజు గడిచినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తరుణంనాజ్‌కు అనుమానం వచ్చి అమెరికాలో భర్త శ్రీనివాస్‌ ఉంటున్న నివాసానికి వెళ్లి చూడగా, అతను అక్కడ లేకపోవడంతో వెంటనే అత్తాపూర్‌లో నివసిస్తున్న తన తల్లి జహంగీర్‌ ఉన్నీసాకు సమాచారం అందించింది. దీంతో ఆమె సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ తరహా కేసులో తప్పనిసరిగా తల్లి ఫిర్యాదు చేయాలని సిబ్బంది సూచించారు. దీంతో తరుణంనాజ్‌ అమెరికా నుంచి ఈ–మెయిల్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్‌–498ఏ కింద కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు