సీఎం కేసీఆర్‌ ప్లాన్‌.. అలా చేస్తే అకాల వర్షం ముప్పు తప్పుతుందా?

4 May, 2023 03:45 IST|Sakshi

వ్యవసాయ సీజన్‌ను ముందుకు జరిపే ప్రతిపాదనపై చర్చ 

అకాల వర్షాలతో పంట నష్టం నుంచి బయటపడేందుకు సీఎం సూచన 

దీనిపై కసరత్తు మొదలుపెట్టిన వ్యవసాయశాఖ 

రైతులను సమాయత్తం చేయడంపై అధికారుల దృష్టి 

నేరుగా గింజలు వెదజల్లే సాగు పద్ధతి పాటించాలని విజ్ఞప్తి 

సీజన్‌ను ముందుకు జరపడంపై వ్యవసాయ శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు 

దేశీ రకాలను ప్రోత్సహించడం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలనే సూచనలు 

దేశీ రకాలతో ప్రయోజనం 
► అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాల వరిని వేయడమే అకాల వర్షాల సమస్యకు పరిష్కారం. భారీ వర్షం, వడగళ్లతో పంట నేలకొరిగినా.. దేశీ వరి మళ్లీ నిలబడుతుంది. మొక్క గట్టిగా ఉంటుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. ఇప్పు డు సాగుచేస్తున్న హైబ్రీడ్‌ రకాల్లో ఎరువులు ఎక్కువ వాడుతారు. మొక్కలు బలహీనంగా ఉంటాయి. నేలకొరుగుతాయి, గింజలు రాలిపోతాయి. స్థానిక వాతావ రణ పరిస్థితులను తట్టుకునేలా.. జిల్లా, మండలాల వారీగా వరి రకంపై నిర్ణయం జరగాలి. 
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా అకాల వర్షాలు.. వడగళ్ల వానలు.. ఈదురు గాలులు.. కోతకు వచ్చిన వరి రాలిపోయింది, కోసి పెట్టిన ధాన్యం నానిపోయింది. ఈ ఒక్కసారే కాదు.. ఏటా ఇదే పరిస్థితి. ఈ సమస్యను తప్పించుకునేందుకు వ్యవసాయ సీజన్‌నే ముందుకు జరిపే ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. సాధ్యాసాధ్యాల పరిశీలనతోపాటు రైతుల్లో అవగాహన కల్పించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది.

వానాకాలం పంటను మే చివరివారంలో, యాసంగిని అక్టోబర్‌ తొలి వారంలో ప్రారంభిస్తే.. అకాల వర్షాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక యాసంగి వరి కోతలను మార్చి నాటికే పూర్తిచేస్తే.. ధాన్యం మిల్లింగ్‌లో నూకలు పెరిగే సమస్య తప్పుతుందని సీఎం కేసీఆర్‌ సూచించడం గమనార్హం. అయితే సీజన్లను ముందుకు జరిపితే వచ్చే లాభనష్టాలపై వ్యవసాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగును ముందుకు జరపడం ఇబ్బందికరమని కొందరు చెప్తుంటే.. ప్రత్యామ్నాయ వంగడాలను వాడటం వంటివి మేలని మరికొందరు సూచిస్తున్నారు. 

మే చివరిలోనే సాగు మొదలైతే.. 
రాష్ట్రంలో నీటి వనరులు, భూగర్భ జలాలు పెరగడం వరి సాగుకు సానుకూలంగా మారిందని.. ఏటా మే నెలాఖరు, జూన్‌ తొలివారంలో వానాకాలం వరి సాగు మొదలయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల సెప్టెంబర్‌ చివర, అక్టోబర్‌ ప్రారంభానికల్లా వరి చేతికి వస్తుందని.. అక్టోబర్‌లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడొచ్చని అంటున్నారు.

ఇక వానాకాలం వరి కోతలు పూర్తికాగానే, అక్టోబర్‌ తొలివారంలోనే యాసంగి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి తొలివారం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చి నెల మధ్య నుంచి అకాల వర్షాల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ మేరకు రైతులను సమాయత్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్లు వేసే విధానానికి బదులు నేరుగా ధాన్యం వెదజల్లే పద్ధతి పాటించడంపై రైతుల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. 
 
క్లిష్టమైన వ్యవహారం! 
వానాకాలం సీజన్‌లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు నాట్లు వేస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో ఆగస్టు 15 వరకు కూడా నాట్లు కొనసాగుతాయి. జూన్‌–జూలైలో వేసిన పంట నవంబర్‌ చివరి నాటికి చేతికి వస్తుంది. ఆగస్టులో వేసేవి డిసెంబర్‌ నాటికి చేతికి వస్తాయి. వానాకాలం పంటలు కోసిన తర్వాత 20 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇక యాసంగి సీజన్‌కు సంబంధించి నవంబర్‌ 15 నుంచి నాట్లు వేయాలి. కానీ వానాకాలం పంట ఆలస్యం వల్ల యాసంగి ఆలస్యం అవుతోంది. డిసెంబర్, జనవరిలో కూడా నాట్లు వేస్తున్నారు. దీనివల్ల ఏప్రిల్, మే వరకు పంటలు చేతికి రావడం లేదు. 

► మొత్తంగా నీటి వసతి, కాల్వల నుంచి విడుదల, వరి వంగడాల్లో రకాలు, మార్కెటింగ్‌ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితులే పంటలు చేతికి వచ్చే కాలాన్ని నిర్దేశిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. 

► ఉదాహరణకు నల్లగొండ జిల్లా రైతులకు ఆగస్టులో కాల్వల నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అదే నిజామాబాద్‌ రైతులకు జూన్, జూలై నెలల్లోనే నీళ్లు అందుతాయి. దీనివల్ల రాష్ట్రంలో ఒక్కోచోట ఒక్కో సమయంలో వరి చేతికి వస్తుంది. 

► నిజామాబాద్‌ జిల్లాలో అనేక చోట్ల మేలోనే నారు పోస్తారు. కొన్నిచోట్ల ఆ నెల చివరి నాటికే నాట్లు కూడా వేస్తారు. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో ఉండదు. 
 
దేశీ రకాలతో ప్రయోజనం 
మార్చిలోగా వరి కోతలు పూర్తికావాలంటున్నారు. మార్చిలో కూడా వడగళ్ల వర్షాలు పడుతున్నాయి కదా.. దీనికి వరిలో అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాలను వేయడమే పరిష్కారం. అదికూడా స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే వరి రకాలు వేసుకోవాలి. జిల్లా, మండలాల వారీగా నిర్ణయం జరగాలి. ఆ ప్రకారం రైతులను సన్నద్ధం చేయాలి. దేశీ రకాల్లో మొక్క గట్టిగా ఉంటుంది. భారీ వర్షం, వడగళ్లు పడినప్పుడు పంట నేలకొరిగినా దేశీ రకం మళ్లీ నిలబడుతుంది.

వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. హైబ్రీడ్‌ రకంలో మొక్క బలహీనంగా ఉంటుంది. సహజ వ్యవసాయం, దేశీ వరి రకాలు వేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. దేశంలో 300 నుంచి 400 దేశీ వరి రకాలు ఉన్నాయి. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్ల వీటి గురించి తెలియడంలేదు. తమిళనాడులో ఒక రైతు దేశీ రకం వరి వేస్తూ అక్కడి వ్యవసాయ వర్సిటీలో బోధన చేస్తున్నాడు.

ఎకరాకు 40–50 క్వింటాళ్ల వరి దిగుబడి సాధిస్తున్నాడు. ఇక వెదజల్లే పద్ధతికి సంబంధించి జర్మినేషన్‌పై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానిపై రైతులు ఆసక్తి చూపరు. ఒక్కో ప్రాంతంలో పరిస్థితిని బట్టి ఒక్కో రకం వరి వేసుకోవాలి. గంపగుత్తగా ఒకే విధంగా, ఒకే సమయంలో వేసుకోవాలని చెప్పడం సరికాదు. 
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు 
 
ముందస్తు సీజన్లు సాధ్యంకాదు 
సంక్రాంతికి అంటే జనవరి 15 సమయంలో యాసంగి పంట వేస్తారు. మార్చి చివరికి అంటే 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. డిసెంబర్‌లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నారు పెరగదు. మొక్క పెరగదు. అప్పుడు వరి వేయకూడదని రైతులకు చెప్పాలి. పైగా తెలంగాణ పీఠభూమి. పీఠభూమి మీద క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా వడగళ్ల వర్షాలు పడతాయి.

రైతులు జనవరి 15కు ముందు యాసంగి నారు వేయరు. అంతేకాదు ఫిబ్రవరిలోనూ రాళ్ల వర్షం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనూ వస్తాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేతప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే రైతులు నష్టపోతారు. 
– సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకుడు  

నెలలో రెండు సార్లు దెబ్బ 
గత నెల రోజుల్లో రెండుసార్లు కురిసిన భారీ వడగళ్ల వానల ధాటికి రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తొలివానలకు 5 లక్షల ఎకరాల్లో, రెండోసారి ఏకంగా 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా వ్యవసాయ శాఖ సర్వే కొనసాగుతోంది. పూర్తి అంచనాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలపై మంగళవారం సమీక్షించిన సీఎం కేసీఆర్‌.. పంటల సీజన్లను కాస్త ముందుకు జరపాలని, యాసంగి సీజన్‌ వరి కోతలు మార్చిలోగా పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది.  

మరిన్ని వార్తలు