ధాన్యం సేకరణ, నీటి వాటాలపై తేల్చుకుంటాం: సీఎం కేసీఆర్‌ 

21 Nov, 2021 01:12 IST|Sakshi

మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి నేడు ఢిల్లీకి.. 

ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలుస్తాం

దేశ రాజధానిలో రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్‌ చట్టాలపై చర్చిస్తాం

రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున ఇవ్వాలి

వ్యవసాయ రంగ బలోపేతానికి ‘ఆత్మ కృషి నిర్భర్‌’ పథకం తేవాలి

కృష్ణా, గోదావరి జలాల వాటాలపై ట్రిబ్యునల్‌ కావాలి

వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రైతులు ఏ పంట వేసుకోవాలో చెబుతాం 

రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలుపై మాట్లాడతామని, బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్రం చెప్పినట్లు మొన్న ఓ గాలివార్త వచ్చింది. ఇది అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం.

ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని నిర్ణయించాం. ఆయా కుటుంబాలను కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల సాయం చొప్పున మొత్తం రూ. 22.5 కోట్లు అందిస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ధాన్యం సేకరణతోపాటు నీటి వాటాలు, ఇతర సమస్యలపై కేంద్రంతో తేల్చుకునేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వెళ్లి.. ఢిల్లీ రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్‌ చట్టాలు తదితర అంశాలపై ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తామని వెల్లడించారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని తేల్చుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ధాన్యంపై ఉలుకూపలుకు లేదు..
‘తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఎటువంటి సమాధానం వస్తలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి సంవత్సరంలో ఎంత సేకరిస్తారో టార్గెట్‌ ఇవ్వమని అడుగుతున్నం. దాన్నిబట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొన్న ధర్నా చేసిన రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. ఏం మాట్లాడలేదు.

ఈ పరిస్థితుల్లో మంత్రులు, ఎంపీల బృందంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల కార్యదర్శుల బృందంతో ఢిల్లీకి వెళ్తున్నం. కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరుతం. అవసరమైతే రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాం. ఆ తరువాత రైతులకు మా విధానం ఏంటో చెపుతం..’అని సీఎం వెల్లడించారు.

కేసులు ఎత్తివేయాలి..వేధింపులు ఆపాలి
‘భద్రతా బలగాల నిర్బంధం, ఒత్తిళ్లు, కేసుల నడుమ 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటం అద్భుత విజయం సాధించింది. చట్టాలను వెనక్కు తీసుకోవడంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఈ ఉద్యమ సమయంలో రైతులపై దేశద్రోహం సహా వేలాది కేసులు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి కేసులను వెంటనే ఎత్తివేసి, రైతులపై వేధింపులను ఆపివేయాలి.

కేంద్రం అనుసరించిన దుర్మార్గ విధానాలతో సుమారు 750 మంది రైతులు పోరాటంలో భాగంగా ఆత్మార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం క్షమాపణలతో చేతులు దులుపుకోకుండా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఇచ్చి ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలి. రైతులపై కేసుల ఎత్తివేత, రూ.25 లక్షల సాయంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర చట్టం కోసం పార్లమెంటులో కొట్లాడుతం..’అని కేసీఆర్‌ చెప్పారు.

విద్యుత్‌ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి
‘దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర కోసం దేశంలోని 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రధాని ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌’తరహాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆత్మ కృషి నిర్భర్‌’పథకాన్ని తీసుకురావాలి. వ్యవసాయ చట్టాల తరహాలోనే పార్లమెంటులో పెట్టిన విద్యుత్‌ చట్టాన్ని కూడా కేంద్రం వెనక్కు తీసుకోవాలి. నూతన కరెంటు చట్టం పేరిట ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రాల మెడపై కత్తి పెట్టడంతో ప్రజలు, విద్యుత్‌ కార్మికులలో ఆందోళన నెలకొంది. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నియంతృత్వ పోకడలకు వెళితే రైతులు రోడ్లెక్కుతారు..’అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

ట్రిబ్యునల్‌ వేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకెవడు?
‘నదీజలాల వివాద చట్టం సెక్షన్‌ 3 ప్రకారం కొత్త రాష్ట్రానికి నీటి వాటాతో పాటు అనేక అంశాల్లో కేంద్రం తాత్సారం చేస్తోంది. 8 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటా తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకుంటున్న ప్రణాళికలు ఆలస్యమై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసినప్పుడు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయమని కోరడంతో పాటు మూడు నాలుగు నెలల కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చాలని అడుగుతం. ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడంలో కేంద్రానికి ఏం అడ్డం పడుతోంది. కేంద్రం రిఫర్‌ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకు ఎవడు? కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ఆందోళనకు దిగుతాం..’అని చెప్పారు. 

బీసీ కుల గణన జరపాలి
‘గిరిజనుల రిజర్వేషన్‌ శాతం పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభ తీర్మానాలు చేసి పంపింది. దేశంలో బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలే కులం సర్టిఫికెట్లు ఇస్తున్న నేపథ్యంలో కులాల లెక్కలు దాచిపెట్టుడెందుకు ? కుల గణన చేపట్టకుంటే పెద్ద వివాదానికి దారితీస్తుంది..’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

పిచ్చిమాటలు వినొద్దు.. రైతులు ఆగం కావొద్దు
‘స్థానిక బీజేపీ నాయకులు పిచ్చిమాటలు కట్టిపెట్టాలి. మీ బండారం బయటపడింది. మీరు చేసిన తప్పులకు ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలి. చిల్లరగాళ్లు చెప్పే మాటలకు రైతులు ఆగం కావద్దు. ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చే క్రమంలో తొందరపడవద్దు. వానాకాలం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు 6,600 కేంద్రాలు ఏర్పాటు చేసి డబ్బులు ఇస్తున్నం. వర్షాలు పడుతున్నందున కోతలు కోయనివారు రెండు మూడు రోజులు ఆగాలి. లేదంటే ధాన్యం రంగు మారి నష్టపోవలసి వస్తుంది. కోసిన వారు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. యాసంగిలోనూ రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు సిద్ధం చేస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఏ పంటలు వేసుకోవాలో రైతులకు చెపుతం..’అని అన్నారు.

ఎన్నికలు ఉన్నందునే వ్యవసాయ చట్టాలు వెనక్కి
‘దేశంలోని ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశంలో బియ్యం తినే జనం ఎక్కువ. మన రాష్ట్రంలోనే పీడీఎస్‌ కింద 25 లక్షల టన్నుల బియ్యం అవసరం. 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్రమే చెపుతోంది. కేంద్రంపై పోరాటంలో ఏ సమయంలో ఎవరిని కలుపుకొనిపోవాలో వారిని కలుపుకొనివెళతాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. దేశంలో ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు..’అని కేసీఆర్‌ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు