9న కేఆర్‌ఎంబీ భేటీ వద్దు

4 Jul, 2021 07:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 9వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఎజెండాలో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా చేర్చాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం  నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ పథకం, సాగునీటి ప్రాజెక్టులలో నీటి ఎత్తిపోతలు, జల విద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని, జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి ఒప్పందాల నిబంధనలు లేవని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51 శాతం ‘క్లీన్‌ ఎనర్జీ’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న కేంద్రం మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై కూడా వీటిని కొనసాగించాలని స్పష్టం చేశారు.

కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కొట్లాడుతామన్నారు. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు 66ః34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగం ఈ ఏడాది నుంచి 50ః50 నిష్పత్తిలో కొనసాగాలన్నారు.   
 

మరిన్ని వార్తలు