అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌

29 Oct, 2020 13:16 IST|Sakshi

మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, మేడ్చల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్‌ రైతు ముంగిట్లోకి వచ్చింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్‌ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్‌లో ఉన్న పార్ట్‌ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్‌ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగనున్నాయి.

దేశానికి మార్గదర్శకం : సీఎం కేసీఆర్‌
ధరణి పోర్టల్‌ ప్రారంచిన తర్వాత సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ దేశానికే మార్గదర్శకం అన్నారు. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఏ దేశంలో ఉన్నా మీ భూమి వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ధరణి పోర్టల్‌ ద్వారా భూములు గోల్‌మాల్‌ అయ్యే అవకాశమే లేదన్నారు. గతంలో ఢిల్లీ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారని, ధరణి పోర్టల్‌ ద్వారా అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్టు వేశామన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. డాక్యుమెంట్‌ రైటర్లను కూడా రాబోయే పది రోజుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఫీజు వసూలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుందన్నారు. కొత్త పాస్‌ పుస్తకం ఏడు రోజుల్లోనే ఇంటికి వస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు