-

చలి తక్కువ.. ఎండ ఎక్కువ!

21 Nov, 2020 04:16 IST|Sakshi

రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న చలి తీవ్రత

పగటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం నమోదు..

పలుచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. సీజన్‌ మొదట్లో వణికించిన చలి.. ఇప్పుడు కాస్త తీవ్రత తగ్గించింది. గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల మొదటి వారంలో రాష్ట్రం లో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లో నమోదు కాగా.. ఇప్పుడు 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో చలి ప్రభావం అదే స్థాయిలో ఉంటుందని భావించినా ప్రస్తుతం ఉష్ణోగ్రతల నమోదులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తోంది. 

కనిష్టం 18.6 డిగ్రీలు.. గరిష్టం 34.8 డిగ్రీలు..
రాష్ట్రంలో వాతావరణ శాఖ 12 సెంటర్లలో ఉష్ణోగ్రతల నమోదును రికార్డు చేస్తోంది. ఈక్రమంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. దుండిగల్‌లో 18.6 డిగ్రీల కనిష్ట, ఆదిలాబాద్‌లో 34.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దుండిగల్, నల్లగొండ మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీల నుంచి 3.7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుండిగల్, ఆదిలాబాద్, నల్లగొండ మినహాయిస్తే మిగతా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 5.1 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం.

ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నీటి వనరులు భారీగా ఉండటంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు మాత్రం అమాంతం పెరుగుతుండటం గమనార్హం.. 

రెండ్రోజులు పొడి వాతావరణమే.. 
రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. హిందూ మహా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వలన దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సుమారుగా నవంబర్‌ 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వివరించింది. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక–తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశమున్నట్లు తెలిపింది.   

మరిన్ని వార్తలు