బాధ్యతలు పెంచినా.. జీతాలు పెంచలే! 

14 Feb, 2024 04:40 IST|Sakshi

ఏళ్లుగా వేతనంలో మార్పులేదని కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్ల ఆవేదన 

తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రం 

వాస్తవ పరిస్థితిని సమీక్షించి బాలికల విద్యకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు.. తమ సమస్యలను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు అనేక బాధ్యతలు అప్పగించి, వేతనం మాత్రం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్నేళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని అంటున్నారు. ఇటీవల కేజీబీవీ సంఘ నేతలు, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం నేతలు దీనిపై సర్కారుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నా.. వారితో సమాన గౌరవం లభించడం లేదని అందులో వాపోయారు.

కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నప్పటికీ అందుకు తగినట్టుగా మౌలిక వసతులు కల్పించడం లేదని.. పట్టించుకోకుంటే చదువుల నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గెజిటెడ్‌ అధికారులు చేయాల్సిన పనులన్నీ ఏళ్ల తరబడి కాంట్రాక్టు కొలువుల్లో ఉన్న తమపై వేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. 

పెరిగిన విధులు.. పెరగని వేతనం.. 
బాలికలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితిని మార్చే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2010–11లో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. హాస్టల్‌తోపాటు నాణ్య­మైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నా­రు. రాష్ట్రంలో 450 కేజీబీవీలున్నాయి. తొలుత ఆరు, ఏడు తరగతులే ప్రారంభించి.. తర్వాత టెన్త్‌ వర­కూ, 2018–19లో ఇంటర్మీడియట్‌ వరకూ అప్‌గ్రేడ్‌ చేశారు.

ప్రతీ కేజీబీవీకి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ సహా ముగ్గురిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించా­రు. వారికి చాలా ఏళ్లుగా నెలకు రూ.32,500 వేత­నమే అందుతోంది. ఇంటర్మీ డియట్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేయడంతో విధులు పెరిగాయి. నెలకు కేవలం రెండే క్యాజువల్‌ లీవ్స్‌ ఉంటాయి. అత్యవసరమై అదనంగా సెలవు పెడితే వేతనంలో కోతపడుతుంది. 

అనుక్షణం విధుల్లోనే.. 
స్కూల్, హాస్టల్, ఇంటర్‌ కాలేజీల నిర్వహణ మొ­త్తం ప్రత్యేక అధికారి చూసుకోవాలి.  కొన్ని జిల్లాల్లో మోడల్‌ స్కూళ్ల బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. కొత్తగా నిర్మిస్తున్న కేజీబీవీల్లో స్కూల్‌ ఒకచోట హాస్టల్‌ మరోచోట ఉంటున్నాయి. దీంతో అన్ని విధులు నిర్వర్తించడం కష్టంగానే ఉందని  వారు చెబుతున్నారు. రాత్రి విధులప్పుడు చాలా ఇబ్బందిపడుతున్నామంటున్నారు. ఆ రోజు మధ్యా హ్నం నుంచి మర్నాడు మధ్యాహ్నం వరకూ నిరంతరం డ్యూటీ ఉంటుందని, దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు.

2017­లో జాబ్‌చార్ట్‌ ఇచ్చినా అందులో మార్గదర్శకాలు ఇవ్వలేదని.. దీనితో అధికారులు ఇష్టానుసారం బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. హాస్టల్‌­లో విద్యార్థులను గమనించడం, భోజనం నాణ్య­త పరిశీలించడం, కాలేజీలో విద్య నాణ్యత వంటి విధుల్లో ఎక్కడ తేడా వచ్చిన అధికారులు తమనే బలిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని సానుభూతితో పరిశీలించాలని కోరుతున్నారు. 

మానసికంగా కుంగిపోతున్నాం 
కేవలం చిన్న స్కూళ్ల విధుల కోసమంటూ మమ్మల్ని తీసుకుని తర్వాత రెట్టింపు బాధ్యతలు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా వేతనం పెంచలేదు. టీచర్ల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థినుల ఉన్నతికి తోడ్పడుతున్నాం. మాకు పని ఒత్తిడి తగ్గించి, వేతనం పెంచితే తప్ప మేం సంతృప్తిగా పనిచేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా గోడు ఆలకిస్తుందని ఆశిస్తున్నాం.  – దోపతి శ్రీలత, రాష్ట్ర కేజీబీవీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు 

వారి పరిస్థితి మెరుగుపర్చాలి.. 
కేజీబీవీ ప్రత్యేక అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ఇటీవల వినతిపత్రం ఇచ్చాం. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా కేజీబీవీ ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపర్చాలి.  –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega