Tollywood Old Love Movies: ఏ సినిమా ప్రేమలు... ఎవరి స్టయిల్‌ వారిదే!

14 Feb, 2024 01:16 IST|Sakshi

ప్రేమించడం నిజజీవితంలో కాస్త అరుదే. అక్కడెవరో వాళ్లెవరో ప్రేమించారట, ఇక్కడెవరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారట అంటూ వినడం తప్ప వాస్తవంలో ప్రేమ అందరికీ అంతగా అనుభవంలోకి రాదు. (కాపోతే కాలేజీల్లో విరివిగా కనిపించినా... చదువు ముగిసేనాటికి, మురిగిపోయే జస్ట్‌ సీజనల్‌ ప్రేమలవి). 

సినిమాల్లో అలా కాదు. ప్రతి మూవీలోనూ ప్రేమ ఉండనే ఉంటుంది. పట్టుబట్టి విషాదాంతం తీయాలని భీష్మించుకుంటే తప్ప... హీరో, హీరోయిన్ల ప్రేమ ఫలించి తీరుతుంది. 

విచిత్రం ఏమిటంటే...  హీరోను బట్టి లేదా దర్శకుడిని బట్టి వారి వారి ప్రేమలకూ ఓ శైలి ఉంటుంది. హీరో మ్యానరిజంలాగా అదీ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది.

ఉదాహరణకు ఎన్టీఆర్‌ సినిమాల్లో అంతా జస్ట్‌ స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ ప్రేమ. అక్కినేని వారి ప్రేమల్లా ఇక్కడ సంక్లిష్టతలుండవు. కాకపోతే అలనాటి గుండమ్మకథలో ‘కోలుకోలోయమ్మ కోలో నాస్వామి’ అంటూ పాడుతూ... ‘హేయ్‌ బుల్లెమ్మా...’ ‘ఓయ్‌ బుల్లెమ్మా’ అంటూ అరుపులు అరిచినా... ఆ తర్వాత ‘త్తిఖ రేగీ థిమ్మిరెఖ్ఖీ’ అంటూ యమగోల చేసినా... అప్పటి అరుపులతో ఇప్పుడు నడుం మీద చరుపులూ కనిపిస్తాయి. వెరసి అవి... దట్టంగా, దిట్టంగా మిళాయించిన మసాళాలా, గ్యాసెక్కువైన సోడాలా ఘాటుగా నాటుగా ఉంటాయంతే. ఎన్టీఆర్‌ ప్రేమలన్నీ దాదాపుగా ఒక హీరోయిన్‌తోనే... సిక్స్‌ లేన్స్‌ హైవే మీద ఎదురెవ్వరూ రాని ట్రాఫిక్‌లా సాఫీగా, హాయిగా సాగిపోయే ప్రేమలే. 

ఇక ఏఎన్నార్‌ దగ్గరికి వస్తే ఆయన సినిమా ప్రేమలన్నీ సంక్లిష్టంగా ఉంటాయ్‌. ఆయన ఎవరినో ప్రేమిస్తాడు... హీరోయిన్‌ కూడా యథాశక్తి ఏఎన్నార్‌ను లవ్‌ చేస్తుంది. కానీ మరెవరో సెకండ్‌ హీరోయిన్‌ కూడా నాగేస్రావ్‌నే లవ్‌ చేయడంతో... కుటుంబంకోసమో, చెల్లెలి ప్రేమ కోసమో... తప్పనిసరి పరిస్థితుల్లో అక్కినేని కూడా ఆమెనే ప్రేమించాల్సొస్తుంది. అంతే...! పాపం అక్కడో ఓ త్రికోణ ప్రేమ ఏర్పడటంతో త్రికోణమితి సూత్రాలూ, లెక్కలూ సినిమాలోకి వచ్చేసి ఈక్వేషన్లను చిక్కుముడుల్లా సంక్లిష్టంగా మార్చేస్తుంది. దాంతో ప్రేక్షకులు కూడా ఆ బెర్ముడా ట్రయాంగిల్‌లో చిక్కి... పాపం గిలగిల్లాడతారు. జామెట్రీ భాషలో చె΄్పాలంటే ఎన్టీఆర్‌వన్నీ సరళరేఖ ప్రేమలూ... ఏఎన్‌ఆర్‌ వన్నీ ట్రిగనామెట్రీ లెక్కలూ!! 

శోభన్‌బాబువి కూడా ఇంచుమించూ త్రికోణమితులేగానీ... ఆయన మనసు మరీ విశాలం కావడంతో ఇద్దరు హీరోయిన్లనీ మితిమీరి సమానంగా ప్రేమిస్తాడు. వారిద్దరి ప్రేమల్నీ తన మనసు సున్నితపు త్రాసులో సమానంగా తూస్తాడు. అద్దిగ్గో... అక్కడొస్తుంది కథలో బలం. నిజానికి ట్రిగనామెట్రీలన్నీ శోభన్‌బాబువే. నిజం చె΄్పాలంటే ఏఎన్నార్‌వి ‘సుడిగుండాలే’! 

ఇక సూపర్‌స్టార్‌ కృష్ణ ప్రేమలు కూడా దాదాపు ఎన్టీఆర్‌ ప్రేమల్లా స్ట్రెయిట్‌గా ఉంటాయి. కాకపోతే హీరోయినే ప్రేమించి ప్రేమించి పైపైన పైపైన పడిపోతుంటుంది. ఈమె తప్పనిసరిగా విలన్‌ కూతురే అయి ఉంటుంది. అంతగా పైపైన పడిపోయినందుకు కృష్ణ కూడా రుణం ఉంచుకోడు. పరిహారంగా డ్యూయెట్లలో ఈయన కూడా ఏదో ఓ టైమ్‌లో ఆమె ఎద మీద తలవాల్చి బదులు తీర్చుకుంటాడు. ఆ దృశ్యమే వాల్‌పోస్టర్‌గా మారి ప్రేక్షకుల్ని సినిమాకు ఆహ్వానిస్తుంది. 

చిరంజీవి హీరోయిన్ల తీరు కూడా ఇంచుమించూ సూపర్‌స్టార్‌ కృష్ణ స్టైల్లోనే ఉంటది. ఈయన కూడా కృష్ణలాగే హీరోయిన్‌ను ‘హేయ్‌ తింగరిబుచ్చి’ అంటూ తీసిపారేస్తూనో... ‘చెయ్యి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో’ అంటూ సరదా  బెదిరింపులతో సందడి చేస్తుంటాడు. చిరంజీవి బెదిరిస్తాడు. హీరోయిన్‌ ప్రేమకోసం దేబిరిస్తుంది. 

ఇంకో విశేషం... చిరంజీవి సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే వాళ్లిద్దరూ తమ శక్తికొద్దీ హీరోని ప్రేమించినప్పటికీ... ఏఎన్నార్, శోభన్‌బాబు ప్రేమల్లోలా ఇక్కడ సంక్లిష్టతలుండవ్‌. ఆ ఇద్దరి ప్రేమలూ గ్లామర్‌ కోసమే. కాబట్టి ఈ ప్రేమల్లో సంఘర్షణలూ ఉండవు. ఇవన్నీ అందంగా చెదిరిపడ్డ సరళరేఖలే కావడంతో ప్రేక్షకులు అదిరిపడ్డానికి ఆస్కారాలుండవ్‌.  
∙∙ 
హీరోల ప్రేమలకే కాదు... తెర మీద ప్రేమను చూపడంలోనూ దర్శకులకూ ఓ స్టైలుంటుందీ, ఓ మేనరిజముంటుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినిమాలో హీరోయిన్‌ ప్రేమలన్నీ చాలా ఉదాత్తంగా ఉంటాయ్‌. నిజజీవితంలో ఏ హీరోయిన్‌లు కూడా ప్రవర్తించనంత ఉన్నతంగా ఉంటాయ్‌. అంతెందుకు... మన జీవితాల్లో మన చెల్లెలికో, మన కూతురికో విశ్వనాథ్‌ సినిమాలో లాంటి హీరో సంబంధం వస్తే స్ట్రెయిటవే వద్దనేస్తాం. అలాంటి హీరోకి మనింటి ఆడబిడ్డనివ్వం. 

డైరెక్టర్‌ రాఘవేంద్రరావు సినిమాలకు వద్దాం. ఇక్కడ ప్రేమలన్నీ ఫ్రూట్‌ జ్యూసులంత  మధురంగా, పండ్లు తింటే సమకూరేంత ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూయెట్లలో!.  అప్పటిదాకా తీసిపారేసే హీరో కూడా... హీరోయిన్‌ ఎద మీద నడుములిరిగిపోయినట్టు వాలిపోయినట్టే... నడుములిరగకపోయినా ప్రేక్షకులూ ఆమె మీద అంతే మోతాదులో మనసు పారేసుకుంటారు. 
∙∙ 
హీరో హీరోయిన్లకు తోడు, సపోర్టింగ్‌ క్యారెక్టర్లూ మేమూ ఉన్నామంటూ తగుదునమ్మా అంటూ వచ్చేస్తారు. వాళ్లూ హీరోయిన్‌ని ప్రేమిస్తారు.  హీరోయిన్‌ దక్కాల్సింది హీరోకే కదా. అందుకే ప్రేమించిన పాపానికి... పాపం వాళ్లు తగిన మూల్యం చెల్లించి శంకరగిరి మాన్యాలకు ట్రైన్‌ టిక్కెట్టు అడ్వాన్సు బుకింగ్‌ చేయించుకుంటారు. అందరికీ తెలిసినా  క్లైమాక్స్‌ వరకూ వాళ్లకా విషయం తెలియకపోవడమే ఇక్కడ విశేషం. 

ఉదాహరణకు... మాయాబజార్‌లో లక్ష్మణకుమారుడైన రేలంగి కూడా శశిరేఖ సావిత్రి మీద మనసు పడతాడు. కానీ నాగేస్రావ్‌కే కదా సావిత్రి దక్కాల్సిందీ! కాబట్టి... దర్శకుడు రేలంగిని ముప్పుతిప్పలు పెట్టిస్తాడు. చేతులు ఠక్కున అంటుకుపోవడంతో... చప్పట్లు కొట్టడానికి కూడా జంకేలా భయపడతాడు. పులిని చూసినట్టు భయపడటమనేది రేలంగికి నిజంగానే అనుభవంలోకొస్తుంది. అప్పుడు రేలంగైనా అంతే... ఇప్పుడు అదుర్స్‌లో బ్రహ్మానందానికైనా ఇంతే. సినిమాలు మారతాయి. హీరోలూ, హీరోయిన్లలో కొత్త తరాలు వస్తాయి. కానీ ప్రేమమాత్రం అజరామరంగా ఉండిపోతుంది. కాకపోతే ఒకనాటి పాత సినిమాల్లో ప్రేమ ఉదాత్తంగా ఉంటుంది. ఈ తర్వాత చిరంజీవి నాటి మధ్యయుగాల్లో కాస్త రఫ్‌గా ఉన్నా సరదా సరదాగా ఉంటుంది. ఇక ఈ తరం అర్జున్‌రెడ్డిలకు వచ్చేసరికి అప్పటి మేన్లీ మేన్‌ కాస్తా... ఇంకాస్త హార్ష్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ అవుతాడు. యాంగ్రీయంగ్‌ కాస్తా యానిమల్‌ అయిపోతాడు. 

సినీ విమర్శకులంతా డార్విన్‌లాగా వచ్చేసి... పరిణామక్రమంలో ఆల్జీబ్రాలూ, ఆల్‌ కెన్‌ బి అఛీవ్‌డ్‌ బై హీరోలనే ఆ ధీరోదాత్తులు తమకు ఉన్న టైటిల్లోని ఉదాత్తత కోల్పోయి... ఆల్ఫా మేల్స్‌గా యానిమల్స్‌గా ప్రవర్తిస్తుంటారని సెలవిచ్చేస్తారు. హీరోయిన్లు మాత్రం అప్పుడూ ఇప్పుడూ డిల్లమొహాలేసుకుని, తెల్లబోతూ, జెల్లకొట్టే ఆ హీరోనే అనాదిగా, అనంతంగా, ఆత్రంగా అలా ప్రేమిస్తూనే ఉండిపోతారు. – యాసీన్‌ 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega