‘సెస్‌’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ 

27 Dec, 2022 01:08 IST|Sakshi
వేములవాడ రూరల్‌ ఫలితం నిలిపివేతపై ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు 

మొత్తం 15 స్థానాల్లో విజయఢంకా

వేములవాడ రూరల్, చందుర్తిపై వివాదం

బీజేపీ శ్రేణులపై లాఠీచార్జి

సిరిసిల్ల: తెలంగాణలోని ఏకైక సహకార విద్యుత్‌ సరఫరా సంఘ (సెస్‌) పాలకవర్గం ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 డైరెక్టర్‌ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం వేములవాడలో లెక్కింపు చేప­ట్టగా.. మొత్తం 15 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అయితే వేములవాడ రూరల్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి బి.మమత తొలుత ప్రకటించారు.

దీనిపై బీఆర్‌ఎస్‌ నాయకులు రీకౌంటింగ్‌ కోరడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆకుల దేవరాజు 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే చందుర్తిలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేశ్‌ 18 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. రాత్రి 8 గంటల తర్వాత చందుర్తి డైరెక్టర్‌గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.శ్రీనివాసరావు రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ రెండు ఉదంతాలపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

బీఆర్‌ఎస్‌ అడ్డదారులు:  సంజయ్‌ 
‘సెస్‌’ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డదారులు తొక్కిందని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. వేములవాడ రూరల్, చందుర్తిల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆ మేరకు ఫలితాలు వెల్లడించకుండా చేశారని ఆరోపించారు.

ఆ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ‘సెస్‌’ ఎన్నికల్లో అధికారులు అధికార పార్టీ నేతలకు చెంచాల్లా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమాదేవి ఒక  ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా జిల్లాలో బలపడిన బీజేపీని ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు