కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల సమావేశంలో ఉద్రిక్తత

6 Jan, 2023 03:35 IST|Sakshi
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బైఠాయించిన కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు 

ప్రెస్‌క్లబ్‌లో బైఠాయించిన అభ్యర్థులు.. అరెస్టు చేసిన పోలీసులు 

పంజగుట్ట: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నెల 6న దున్నపోతులకు వినతిపత్రం, 7 కలెక్టరేట్‌ల ముందు ధర్నా, 9వ తేదీ చలో హైదరాబాద్‌ నిర్వహిద్దామని తీర్మానం చేసి కార్యాచరణ ప్రకారం వెళదామనగా కొందరు ప్రతిపాదించగా,

మరికొందరు వ్యతిరేకిస్తూ  సమస్యలు పరిష్కరించే వరకు ప్రెస్‌క్లబ్‌లోనే ఆమరణ నిరాహారదీక్షకు కుర్చున్నారు. పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి ఎంత సముదాయించినా వినకపోవడంతో రాత్రి 7:30 గంటల సమ యంలో అభ్యర్థులను, వారికి మద్దతు పలికిన నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. 

ఆ 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని... 
పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులందరికీ మెయిన్స్‌ పరీక్షకు అవకాశం కల్పించాలని, హైకోర్టు ఆదేశాల మేరకు 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని, రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తూ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వీరికి మద్దతు పలికేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, సీపీఐ, సీపీఎం నేతలు బాలమల్లేష్, నర్సింగ్‌రావు హాజరయ్యారు.

కోదండరామ్‌ మాట్లాడుతూ ఆర్మీ సెలక్షన్స్‌లో కూడా లేని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామకాల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అభ్యర్థులు పాత పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్‌ చేయమంటున్నారని అన్నారు.  కార్యక్రమ నిర్వాహకులు వివిధ విద్యార్ధి సంఘాల నేతలు కె.ధర్మేంద్ర, ఆనగంటి వెంకటేశ్, సలీంపాషా, డాక్టర్‌ వలీఖాద్రీ, కోట రమేశ్, అశోక్‌ రెడ్డి, రెహమాన్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు