జిల్లా వ్యాప్తంగా 200మంది సిబ్బందికిపైగా కరోనా

26 Aug, 2020 11:05 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లా పోలీస్‌ శాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తించే సీఐలు, ఎస్‌ఐలు సహా కానిస్టేబుళ్లు, హోంగార్డుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పోలీస్‌ సిబ్బంది విధులకు రావడానికి సైతం జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 200మందికిపైగా పోలీస్‌ సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. ఖమ్మం నగరంలో తీవ్రత ఎక్కువగా ఉంది. నిరంతరం బందోబస్తులు, 24గంటల విధుల నిర్వహణ వల్లే పోలీసులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. చాలా పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటికే కరోనా బారిన పడి..చికిత్స పొందుతున్నారు. దీంతో ఫిర్యాదుదారులు కూడా రావాలంటే జంకుతున్నారు. 

కరోనాతో ఏఎస్‌ఐ మృతి..
జిల్లాలో మొదటిసారిగా ఖమ్మంలో కరోనా మహమ్మారికి ఆర్ముడ్‌ రిజర్వుడ్‌ (ఏఆర్‌) విభాగానికి చెందిన ఓ ఏఎస్‌ఐ మంగళవారం మృతి చెందారు. చాలా ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ..మూడు రోజుల కిందటే ఏఎస్‌ఐగా ఉద్యోగోన్నతి పొందారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటుకు గురై..చనిపోయారు. ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు