బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా

25 Dec, 2020 00:39 IST|Sakshi

రాష్ట్రానికి బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల సంఖ్య 1,200

846 మంది శాంపిళ్ల సేకరణ..

కొత్త వైరసో కాదో తేల్చేందుకు సీసీఎంబీకి శాంపిళ్లు..

జన్యు విశ్లేషణ చేశాక నిర్ధారించనున్న శాస్త్రవేత్తలు

బ్రిటన్‌ వైరస్‌ సోకిన వారికి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు..

పరిస్థితిపై మంత్రి ఈటల ఉన్నత స్థాయి సమీక్ష..

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. వారిలో ఎందరికీ బ్రిటన్‌ వేరియంట్‌ కొత్త వైరస్‌ సోకిందో నిర్ధారించేందుకు ప్రభుత్వం సీసీఎంబీకి ఆ ఏడుగురి శాంపిళ్లను పంపింది. అక్కడ వాటిని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పద్ధతిలో జన్యు విశ్లేషణ చేస్తారు. డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి నేరుగా.. యూకే మీదుగా తెలంగాణకు మొత్తం 1,200 మంది వచ్చారని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 846 మందిని గుర్తించి వారి నమూనాలను పరీక్షించగా అందులో ఏడుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారిని కలసిన వారందరినీ కూడా ట్రేస్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెగెటివ్‌ వచ్చిన వారిని సైతం మానిటర్‌ చేస్తున్నట్లు వివరించారు. పాజిటివ్‌ వచ్చిన ఈ ఏడుగురు హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు చెందిన వారని వెల్లడించారు. ఒకవేళ బ్రిటన్‌ వైరస్‌ సోకితే వారికి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తారు. అంటే రాష్ట్రంలో నిర్దేశించిన 12 ఆసుపత్రుల్లో బ్రిటన్‌ వైరస్‌ వార్డు, చైనా వైరస్‌ వార్డులుగా తీర్చిదిద్దనున్నారు.  

అప్రమత్తంగా ఉండాలి..: మంత్రి ఈటల 
కొత్త రకం కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, కరోనా రాష్ట్ర సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు. ఈ కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలు ఇంటికే పరిమితమై జరుపుకోవాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని, మాస్క్, భౌతిక దూరం, తరచూ చేతులు శుభ్రపరుచుకోవడం మరిచిపోవద్దని కోరారు.  

వ్యాక్సిన్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు.. 
కరోనా వైరస్‌ భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం, టీకా రాష్ట్రానికి అందిన వెంటనే ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. వ్యాక్సిన్‌ రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై అధికారులతో చర్చించారు. ‘వ్యాక్సిన్‌ వేయడానికి 10 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వీరంతా రోజుకు వంద మందికి టీకా వేసినా పది లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్‌ వేయగలం. మొదటి దశలో 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. వైద్య ఆరోగ్య, పోలీస్, మున్సిపల్, ఫైర్‌ సిబ్బందితో పాటు వయసు మీద పడిన వారికి మొదటి దశలో టీకా ఇవ్వనున్నాం. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేయాలి. వ్యాక్సిన్‌ సరఫరాకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి’అని అధికారులను ఆదేశించారు. 

కరీంనగర్‌ జిల్లాలో కలకలం
సాక్షి, పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్‌/జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ‘బ్రిటన్‌ వైరస్‌’కలకలం రేగింది. ఇటీవల బ్రిటన్‌ నుంచి కరీంనగర్‌ జిల్లాకు 16 మంది, పెద్దపల్లి జిల్లాకు 10 మంది, జగిత్యాల జిల్లాకు 12 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాకు నలుగురు వచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది అందరి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించారు. మొత్తం 42 మందిలో 30 మందికి నెగెటివ్‌ వచ్చినట్లుగా తెలిసింది. అయితే బ్రిటన్‌ నుంచి వచ్చిన బీర్‌పూర్‌ మండలం తుంగూరుకు చెందిన ఒకరికి, అమెరికా నుంచి వచ్చిన జగిత్యాలకు  చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు.  

 ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంపై దృష్టి.. 
కరోనా లాంటి మహమ్మారులను తట్టుకోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈటల చెప్పారు. ‘ప్రస్తుతం 11 సీటీఆర్‌ స్కాన్లు, 3 ఎంఆర్‌ఐ మెషీన్లను వెంటనే కొనుగోలు చేయాలి. సాధ్యమైనంత త్వరగా వీటిని అందు బాటులోకి తేవాలి. ఆసుపత్రుల్లో ఉన్న ఆపరేషన్‌ థియేటర్లను  ఆధునిక సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా నవీకరించాలి. మరో ఆరు నెలల్లో వీటిని సిద్ధం చేయాలి. బస్తీ దవాఖా నాలకు వచ్చిన పేషెంట్లకు వైద్య పరీక్షల కోసం 8 డయాగ్నస్టిక్‌ మినీ హబ్‌లను సిద్ధం చేశాం. అక్కడ రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, ఈసీజీ పరీక్షలు చేయనున్నాం. ఈ నెలాఖరు నుంచి ఈ హబ్‌లను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం.  డయాలసిస్‌ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా చూడాలి’అని మంత్రి అధికారులకు సూచించారు.  

మరిన్ని వార్తలు