‘దళిత బంధు’ ఆగయా.. ఎవరి అకౌంట్లో పడతాయో తెలుసా

10 Aug, 2021 09:13 IST|Sakshi
డప్పు కొడుతున్న ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

 రూ.500 కోట్లు విడుదల..  5 వేల మందికి లబ్ధి

లబ్ధిదారుల ఎంపికలో యంత్రాంగం

నిధులు మొత్తం హుజూరాబాద్‌కే..

సాక్షి, కరీంనగర్‌: దళిత జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకానికి శ్రీకారం పడింది. దీర్ఘకాల ఉపాధి, ప్రయోజనం దృష్ట్యా పథకం రపొందించగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే ప్రధాన ఉద్దేశం. కాగా అతివ పేరునే నగదు జమ కానుంది. మహిళలలైతేనే ప్రతీ రుపాయిని పొదుపుగా వాడుతారనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా తొలి సారిగా వాసాలమర్రికి నిధులు కేటాయించారు. తదుపరి మన జిల్లాలోని హుజూరాబాద్‌కు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రూ.500 కోట్లు విడుదల కాగా.. 5 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. లబ్ధిదారుల ఎంపికలో యంత్రాంగం తలమునకలవగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ప్రత్యేక దృష్టిసారించారు. దళిత బంధు నిధులు తొలుత హుజూరాబాద్‌కే వినియోగిస్తామని కలెక్టర్‌ వివరించారు.

లబ్ధిదారుల ఎంపికలో యంత్రాంగం
ప్రభుత్వ మార్గదర్శకాల క్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా ఇప్పటికే యంత్రాంగం సర్వే నిర్వహించింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎస్సీలు ఎన్ని కుటుంబాలున్నాయి, మాదిగ, మాల సామాజికవర్గాల కుటుంబాల వారీగా లెక్కలు తీశారు. నియోజకవర్గంలో జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్‌ మండలాలుండగా గ్రామాల వారీగా వివరాలు నమోదు చేశారు. 20,929 కుటుంబాలున్నాయని తేల్చగా గైడ్‌లైన్స్‌ ప్రకారం మళ్లీ లబ్ధిదారులను వడబోయనున్నారు.

కొలువుంటే బంద్‌
ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబానికి పథకం వర్తించదు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో ప్రతీ దశలోనూ ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందించనుంది. దళిత బంధును సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కమిటీలో కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవో, డీఆర్డీవో, వ్యవసాయ, రవాణా, పారిశ్రామిక విభాగాల నుంచి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఎస్సీ సొసై టీ ఈడీ, ఇద్దరు నామినేటెడ్‌ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. 

మండలస్థాయి కమిటీలో ఎంపీడీవో, తహసీల్దార్, రవాణా, వ్యవసాయ శాఖ అధికారులు, ఒక్కొక్కరు ఇద్దరు నామినేటేడ్‌ వ్యక్తులు, పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏ, ఇద్దరు నామినేటేడ్‌ వ్యక్తులు ఉంటారు. అర్హులైన వారు నమోదు చేసుకునేలా చూడటం వారు అనువైన వ్యాపారం ఎంచుకోవడంలో సహకరిండం ఈ కమిటీల బాధ్యత. 

లబ్ధిదారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు అందజేసి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందేలా చేస్తారు. ఈ మేరకు ఎంపిక చేసిన దళిత కుటుంబంలో మహిళా పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు. లబ్ధిదారులు చేయాల్సిన వ్యాపారానికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలతో జాబితా రూపొందించినట్లు సమాచారం.  ఏ వ్యాపారం చేయాలనే దానిపై లబ్ధిదారుడిదే తుది నిర్ణయం. వ్యాపారం మొదలు పెట్టాక కమిటీలు ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వ్యాపార తీరుతెన్నులు, ఆదాయంపై ఆరా తీస్తాయి. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను డేటాబేస్‌లో నమోదు చేస్తాయి. 

అంతా ఆన్‌లైన్‌లోనే 
దళితబంధు పథకం దరఖాస్తుల స్వీకరణ మొదలు, పరిశీలన, అర్హత నిర్ధారణ, ఆర్థిక సాయం అందజేత తదితర ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే కొనసాగనుంది. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సీజీజీ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రపొందించింది. దీనికి సవంతరంగా యాప్‌ను కూడా తయారు చేసింది. ప్రస్తుతం ఇది ప్రయాగదశలో ఉంది. వీలైనంత త్వరలో వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. క్షేత్రస్థాయి అధికారులు మొదలు జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు ఈయా ద్వారా నిరంతరం పథకం అమలు తీరును పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను సీజీజీ కేటాయిస్తుంది. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విదేశీ విద్యా నిధి పథకంలో గరిష్ఠ లబ్ధి రూ. 20 లక్షలు కాగా.. దాని తరువాత దళిత బంధు పథకం కిందే అధిక మొత్తంలో అందనుంది.

లబ్ధిపొందని కుటుంబానికి ప్రాధాన్యత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు లబ్ధి పొందని కుటుంబానికి ఈ పథకంలో తొలి ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్న భూమి లేని పేద కుటుంబాన్ని ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారు కుటుంబంలోని మహిళా పేరిట పథకం మంజూరు చేస్తారు. ఒకవేళ ఆ కుటుంబంలో అర్హురాలైన మహిళా లేనప్పుడు పురుషుడికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దరఖాస్తుదారులు తాము ఏర్పాటు చేసే యూనిట్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ రిపోర్టును పక్కాగా సమర్పించాలి. అన్ని కోణాల్లో వడబోసిన తరువాతే ఎస్సీ కార్పొరేషన్‌ అర్హులను ఖరారు చేస్తుంది. అయితే.. ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు నగదు జమ చేస్తామని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ‘సాక్షి’కి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.

హుజూరాబాద్‌లో సంబరాలు
హుజూరాబాద్‌: హుజూరాబాద్‌కు దళితబంధు నిధులు విడుదల చేయడంతో నియోజకవర్గ దళిత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులు రుణపడి ఉంటారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు. డప్పు చప్పుళ్లతో రంగులు చల్లుకున్నారు. బాణాసంచా కాల్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం ప్రారంభానికి వస్తారని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. మొదటి విడుతగా మంజూరైన రూ.500 కోట్లు అర్హులైన వారికి అందజేసేందుకు జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. నాయకులు మొలుగూరి ప్రభాకర్, సందమల్ల బాబు, మొలుగు పూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత కుటుంబాల సంఖ్య

ఇల్లందకుంట 2,586
హుజూరాబాద్‌ 5,323
జమ్మికుంట 4,346
కమలాపూర్‌ 4,996
వీణవంక 3,678
మొత్తం 20,929

 నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్ల సంఖ్య

మండలం మాదిగ   మాల ఇతర మొత్తం
ఇల్లందకుంట 6,786 1,846   534  9,166
హుజూరాబాద్‌  7,810  1,844  516   10,170
జమ్మికుంట 6,745  1,807 470 9,022
కమలాపూర్‌  6,820  1,857   537   9,214
వీణవంక 4,851  1,390  453   6,694
మొత్తం 33,012  8,744  2,510  44,266

మరిన్ని వార్తలు