సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణకు లైన్‌క్లియర్‌

27 Oct, 2022 01:27 IST|Sakshi
పరిశీలనలో ఉన్న డిజైన్లు  

రూ. 699 కోట్లకు టెండర్‌ దక్కించుకున్న ఢిల్లీ సంస్థ

36 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరణ: ఇన్‌చార్జి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించే ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఇదిగో అదిగో అంటూ ఇంతకాలం ఊరించిన రైల్వే.. ప్రస్తుత భవనాలను కూల్చి వాటి స్థానంలో విమానాశ్రయం తరహా వసతులతో పునర్నిర్మించే ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. రూ.699 కోట్లకు కోట్‌ చేసిన ఢిల్లీ సంస్థ గిరిధారిలాల్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ టెండర్‌ను దక్కించుకుంది. 36 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో రైల్వే ఒప్పందం కుదుర్చుకుంటోంది.

ప్రయాణికులకు సౌకర్యం కోసం..
దేశవ్యాప్తంగా 123 స్టేషన్లను రూ.50 వేల కోట్లతో ఆధునీకరించాలని రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌–1 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్‌ స్టేషన్‌ను అప్‌గ్రెడేషన్‌ ప్రాజెక్టు కోసం గతంలోనే రైల్వే బోర్డు ఎంపిక చేసింది. రూ.500 కోట్ల వార్షికాదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉపయోగించే స్టేషన్‌ను ఈ గ్రేడ్‌ కింద గుర్తిస్తారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ను రోజుకు సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారు.

నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసిన రైల్వేబోర్డు.. ఈ స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టెండర్లు ఖరారు చేసింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం చాలా అవసరమని, అందుకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌కుమార్‌ జైన్‌ చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.

భారీ భవనాలు, పార్కింగ్‌ సదుపాయాలతో..
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రెండు వైపులా మూడంతస్తులతో రెండు భారీ భవన సముదాయాలు ఉంటాయి. రెండు భవనాలను అనుసంధానిస్తూ ట్రావెలేటర్స్‌ (ఆటోవాకింగ్‌ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇక దక్షిణ భాగం వైపు 2వేల వాహనాలను నిలిపేలా మల్టీలెవల్‌ అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ ఉంటుంది.. ఉత్తరభాగం వైపు మూడు వేల వాహనాలను నిలిపేలా ఐదు అంతస్తుల పార్కింగ్‌ టవర్‌ నిర్మిస్తారు. ప్లాట్‌ఫామ్‌లన్నింటినీ ఆధునీకరిస్తారు. అన్నింటినీ కవర్‌ చేస్తూ పైకప్పు ఉంటుంది. రైల్వేస్టేషన్‌ను మెట్రోరైల్‌స్టేషన్లకు అనుసంధానిస్తూ స్కైవేలను నిర్మిస్తారు. 

మరిన్ని వార్తలు