తెలంగాణ రైతుకు షాకిచ్చిన సైంటిస్టు

8 Jan, 2022 01:39 IST|Sakshi

తేల్చిచెప్పిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

మిరప పంట తొలగించి వేరే పంట వేసుకోవాలని సూచన

మహబూబాబాద్‌ జిల్లాలో మిర్చి పంటలను పరిశీలించిన ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం

సాక్షి, మహబూబాబాద్‌/కురవి 
శాస్త్రవేత్త: మీ పేరేంటి..?
రైతు: నాపేరు కుంట యాదగిరి
శాస్త్రవేత్త: ఏం విత్తనాలు వేశారు
రైతు : రెండు ఎకరాల్లో 001 విత్తనాలు వేశాను
శాస్త్రవేత్త: ఎన్నిసార్లు మందులు కొట్టారు
రైతు: వారానికోసారి, పురుగు ఎక్కువ ఉన్నప్పుడు రెండుసార్లు కూడా కొట్టాను
శాస్త్రవేత్త: ఏం మందులు కొట్టారు
రైతు: మోనో, బయోరీటా, పోలీసు ఇలా ఒక్కటా రెండా.. ఎవరు ఏం చెబితే అది కొట్టినా రోగం పోలేదు. ఇప్పుడు ఏం చేస్తే రోగం పోతుంది సార్‌.. 
శాస్త్రవేత్త: ఇప్పటివరకు తామర పురుగు నివారణకు మందు లేదు. పరిశోధన స్థాయిలోనే ఉంది. వచ్చే ఏడాది వరకు మందులు కనుగొనే అవకాశం ఉంది. 
రైతు: ఇప్పుడు ఏం చేయాలి సార్‌.. 
హార్టికల్చర్‌ అధికారి: ఏం మందులు కొట్టినా లాభం లేదు. చేను దున్నేసి వేరే పంటలు సాగుచేసుకోవడమే ఉత్తమం.     

ఇదీ మహబూబాబాద్‌ జిల్లా కురవి మం డలం మోదుగులగూడెం గ్రామరైతు కుంట యాదగిరి, ఢిల్లీ శాస్త్రవేత్త రాఘవేంద్ర, మహబూబాబాద్‌ జిల్లా హార్టికల్చర్‌ అధికారి సూర్యనారాయణ మధ్య సాగిన సంభాషణ. రాష్ట్రవ్యాప్తంగా మిర్చి పంటను నాశనం చేసిన తామర పురుగు తీరును పరిశీలించేందుకు మహబూబాబాద్‌ జిల్లా కురవి, డోర్నకల్‌ మండలాల్లో ఢిల్లీ శాస్త్ర వేత్తల బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా రైతుల చేలకు వెళ్లి పంటకు తెగులు ఆశించిన తీరు, రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. 

ముందే చెబితే బాగుండేది: కాత, పూత దశలో మిర్చి పంటను నాశనం చేస్తున్న తామర పురుగును గత ఏడాదే గుర్తించినట్లు ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఏపీలోని గుంటూరు, పిడుగురాళ్ల ప్రాంతంలో ఈ తామర పురుగు వచ్చిందని తెలిపారు. అయితే ఈ తెగుళ్ల గురించి ఈ ఏడాది ప్రారంభంలో తమకు అవగాహన కల్పిస్తే బాగుండేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్‌లో బెంగళూరు శాస్త్రవేత్తల బృందం వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి తామర పురుగు తీవ్రతను గుర్తించింది. అప్పుడు కూడా ఈ పురుగుకు మందు లేదనే విషయం తెలపలేదు. దీంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఎకరాకు రైతులు రూ. 20వేల నుంచి రూ. 30వేల విలువచేసే మందులు కొట్టారు. అప్పుడు చెబితే ఈ అప్పులైనా తప్పేవని రైతులు అంటున్నారు. 

నట్టేట మునిగిన రైతులు 
గత ఏడాది మిర్చి సాగుచేసిన రైతులకు అధిక లాభాలు వచ్చాయి. దీంతో చాలా మంది రైతులు మిర్చి పంటవైపు మొగ్గారు. గత ఏడాది రాష్ట్రంలో 2.40 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా, ఈ ఏడాది 3.58 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అత్యధికంగా ఖమ్మంలో 1,02,853 ఎకరాలు సాగు చేశారు. మహబూబాబాద్‌లో 82,482 ఎకరాలు, జోగుళాంబలో 34,873, వరంగల్‌లో 27,479, జయశంకర్‌ భూపాలపల్లిలో 30,330, భద్రాద్రి కొత్తగూడెంలో 26,185, సూర్యాపేట జిల్లాలో 21,472 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో 2 లక్షల ఎకరాలు తామర పురుగు బారిన పడి మిర్చి రైతులు నష్టపోయారని, ఒక్కొక్క ఎకరానికి రూ.70 వేల మేరకు రైతులకు నష్టం వాటిల్లిందని అంచనా. 

ఎన్ని మందులు కొట్టినా పోవడం లేదు
ఎకరంలో మిర్చి సాగు చేశాను. మూడు రకాల విత్తనాలను తీసుకొచ్చి వేశాను. ఎకరానికి రూ.40వేల పెట్టుబడి పెట్టాను. వారానికి రెండు సార్లు మందులు కొట్టాను. ఎన్ని మందులు కొట్టినా పురుగు పోవడంలేదు. పురుగు పోవడానికి మందు లేదు.. చేను మొత్తం దున్నుకోమన్నరు.


– కొత్త వెంకన్న,  మోదుగులగూడెం, కురవి  

మరిన్ని వార్తలు