ఢిల్లీలో ముందుగానే చలికాలం సెలవుల ప్రకటన | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ముందుగానే చలికాలం సెలవుల్ని ప్రకటించిన ప్రభుత్వం

Published Wed, Nov 8 2023 2:47 PM

Air Pollution Effect Early Winter Break In Delhi Schools - Sakshi

దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతుండంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్‌ 09 నుంచి 18 దాకా సెలవులు ఉంటాయని ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఢిల్లీలో గత ఆరురోజులుగా విషపూరిత వాయువులు వాతావరణాన్ని కమ్మేశాయి. రాబోయే కొద్ది రోజుల్లోనూ ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని..  ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి నగరానికి ఉపశమనం లభించకపోవచ్చని ఢిల్లీ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. సాధారణంగా డిసెంబర్‌-జనవరిలో చలి తీవ్రత దృష్ట్యా సెలవులు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈసారి ఆ సెలవుల్ని కాలుష్యం నేపథ్యంలో ముందుకు జరిపినట్లు ఢిల్లీ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది.

బుధవారం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషి, రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరై .. స్కూళ్ల సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. 

చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు  సెలవులు ప్రకటించింది.  10, 12వ తరగతులకు మినహా మిగతా అక్కడి తరగతుల విద్యార్థులు ఈ శుక్రవారం(నవంబర్‌ 10) తేదీ వరకు స్కూళ్లకు హాజరు కానక్కర్లేదని(ఫిజికల్‌ క్లాస్‌లకు మాత్రమే) ఆదేశించింది. అయితే పరిస్థితి తీవ్రతరం అవుతుండడంతో తాజాగా సెలవుల్ని పొడిగించింది. 

దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్‌లో తొలిసారి తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశించాయి. వచ్చే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) ‘తీవ్రమైన’ విభాగంలో నమోదు కావడం గమనార్హం.

నగర వాసుల మెడపై వేలాడుతున్న కాలుష్య కత్తిని తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది, కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు 395 ఉన్న AQI.. బుధవారం ఉదయానికి 421కి చేరింది. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా 409 వద్ద వాయు నాణ్యత సూచీ నమోదు అయ్యింది. 

ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం

Advertisement
Advertisement