ఈఎస్‌ఐ ‘కార్పొరేట్‌’ సేవలు మరింత చేరువలో! 

13 Jan, 2023 09:27 IST|Sakshi

వైద్య సేవల విస్తరణకు డీఐఎంఎస్‌ కసరత్తు

జిల్లాకో కార్పొరేట్‌ ఎంప్యానెల్‌

ఆస్పత్రి ఉండేలా ప్రతిపాదనలు

ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ఆమోదం లభిస్తే మరో 40 ఎంప్యానెల్‌ ఆస్పత్రులు  అందుబాటులోకి

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ (ఉద్యోగ రాజ్య బీమా) చందాదారులకు వైద్య సేవలను మరింత చేరువలోకి తెచ్చే దిశగా డీఐఎంఎస్‌ (డైరెక్టర్‌ ఇన్యూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సూపర్‌ స్పెషాలిటీ, మూడు జనరల్‌ ఆస్పత్రులతోపాటు 71 డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలందుతున్నాయి.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రెండు జనరల్‌ ఆస్పత్రులు హైదరాబాద్‌ సమీపంలో ఉండగా.. మరో రెండు ఆస్పత్రులు వరంగల్, సిర్పూర్‌లో ఉన్నాయి. మిగతా డిస్పెన్సరీలు జిల్లాల్లో ఉన్నప్పటికీ అక్కడ కేవలం అవుట్‌ పేషెంట్‌ విభాగాల సేవలతోనే సరిపెడుతున్నాయి. ఈక్రమంలో శస్త్ర చికిత్సలు, మేజర్‌ చికిత్సల కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చందాదారులకు మరింత మెరుగైన సేవలను వేగంగా అందించేందుకు కొత్తగా ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులను ఎంపిక చేయాలని డీఐఎంఎస్‌ భావిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలను రూపొందించింది. 

జిల్లాకో ఆస్పత్రి చొప్పున... 
రాష్ట్రంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ 21 కార్పొరేట్‌ ఆస్పత్రులను ఎంప్యానెల్‌ చేసింది. ఇందులో మెజార్టీ ఆస్పత్రులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. అలాకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఎంప్యానెల్‌ ఆస్పత్రులు ఉండేలా డీఐఎంఎస్‌ కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాకొక కార్పొరేట్‌ ఆస్పత్రిని ఎంప్యానెల్‌ చేస్తే సంబంధిత జిల్లా పరిధిలోని చందాదారులకు అత్యవ సరంగా మెరుగైన సేవలు అందుతాయనే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.

ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 40 ఆస్పత్రులను ఎంప్యానెల్‌ చేయాలని భావిస్తోంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతోనూ ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఈఎస్‌ఐ ప్రాంతీయ బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు. డీఐఎంఎస్‌ ప్రతిపాదనలను త్వరలో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు పంపా లని నిర్ణయించారు. అక్కడ ఆమోదం వచ్చాక ఆస్పత్రుల తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇదంతా వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు