అలాంటప్పుడు అక్కడ సర్కార్‌ ఎందుకు?: సుప్రీం | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సర్కార్‌ వర్సెస్‌ కేంద్రం.. నియంత్రణ కేంద్రానిదే అయితే రాష్ట్ర సర్కార్‌ దేనికి?

Published Fri, Jan 13 2023 9:30 AM

Supreme Court Asks Centre Why Elect Government In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం పంచాయితీకి సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు..  కేంద్రానికి ఉన్న అధికారాలకు కొనసాగింపు అని కేంద్రం నొక్కి చెప్పడంతో, అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని.. సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది.

అధికారం, సేవలు.. పరిపాలనపై నియంత్రణ.. తదితర అంశాల్లో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలోనే వైరం నడుస్తోంది. ఈ దరిమిలా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వరుసగా మూడోరోజు వాదనలు వింది. గురువారం విచారణ సందర్భంగా.. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ.. ఢిల్లీ దేశ రాజధాని అని, దానికంటూ ఓ ఏకైక హోదా ఉందని, అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు గనుక ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు.  గతంలోని ఓ తీర్పును ప్రస్తావించిన ఆయన.. ఢిల్లీ కాస్మోపాలిటన్‌ నగరమని, ఒక మినీ భారత్‌లాంటిదని వ్యాఖ్యానించారు. 

అయితే.. రాష్ట్ర, ఉమ్మడి జాబితాలోని అంశాలను ధర్మాసనం గౌరవిస్తుందని, కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విషయాలపై శాసనం చేసే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలపై పార్లమెంటుకు శాసనపరమైన నియంత్రణ ఉంటే, ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే.. ఢిల్లీ శాసన అధికారాలలో భాగంగా సేవలపై శాసన నియంత్రణను ఏవిధంగా ఉద్దేశించలేదో చెప్పాలని న్యాయస్థానం సొలిసిటర్ జనరల్‌ను కోరింది. ఒకానొక తరుణంలో ఎల్జీ విశిష్ట అధికారాల ప్రస్తావన సైతం లేవనెత్తింది బెంచ్‌. 

ఆ సమయంలోనే సోలిసిటర్‌ జనరల్‌.. కేంద్ర పాలిత ప్రాంతమనేది కేంద్రానికి(యూనియన్‌)కు కొనసాగింపని, ఆ ఉద్దేశం దాని పరిధిలోని పరిపాలన కేంద్రం పరిధిలోకి వస్తుందని సోలిసిటర్‌జనరల్‌ కోర్టుకు తెలిపింది. అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఎందుకంటూ బెంచ్‌.. సోలిసిటర్‌ జనరల్‌ను నిలదీసింది. పరిపాలన కేంద్ర ప్రభుత్వానిదే అయితే, ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోలిసిటర్‌ జనరల్‌ స్పందించారు. క్రియాత్మక నియంత్రణ అనేది ఎన్నికైన ప్రభుత్వానిదని, కేంద్రం పరిపాలనా నియంత్రణతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. అందులో కేంద్ర, రాష్ట్ర సర్వీసులు ఉన్నాయని, కేంద్ర పాలిత ప్రాంతాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ తరుణంలో సమయం ముగియడంతో.. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జనవరి 17కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 

ఢిల్లీలో పాలన, ఇతర సేవల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం.. అత్యున్నత న్యాయస్థానాన్ని గతంలో ఆశ్రయించింది. 2018లో.. ధర్మాసనం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ప్రభుత్వం సలహాలకు కట్టుబడి ఉంటారని, ఇద్దరూ ఒకరితో ఒకరు సామరస్యపూర్వకంగా పనిచేయాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే.. 2019 ఫిబ్రవరిలో మాత్రం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ భిన్న తీర్పులను వెల్లడించింది. పైగా ఆ ఇద్దరు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లు ఆ తర్వాత రిటైర్‌ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం.. చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ అయ్యింది.

Advertisement
Advertisement