Kaushik Reddy: షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ.. భారీ జరిమానా

23 Jul, 2021 13:59 IST|Sakshi

ఫిర్యాదులు..పెనాల్టీలు 

కౌశిక్‌రెడ్డి ఫెక్ల్సీలు, జెండాల తొలగింపు 

భారీగా జరిమానాల విధింపు 

సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా పాడి కౌశిక్‌రెడ్డి పేరిట ఐటీ కారిడార్‌తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధ్యులకు జరిమానా విధించాలని పదుల సంఖ్యలో ట్వీట్‌ చేశారు. దీనిపై ఈవీడీఎం స్పందించింది. ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు, హోర్డింగులను తొలగించడమే కాకుండా జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి పక్షపాతం లేదని, చట్టం మేరకు పారదర్శకంగా పనిచేస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ వారికి సమాధానమిచ్చారు. 

ఆయా ప్రాంతాల్లోని ఫ్లెక్సీలకు కౌశిక్‌రెడ్డికి పెనాల్టీలు విధిస్తూ ఈవీడీఎంలోని సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఈ–చలానాలు జారీ చేసింది. ఒక్కో ఫ్లెక్సీకి రూ.5 వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలు విధించింది. మొత్తం 4.56 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. మీ ఫిర్యాదు పరిశీలించామని, త్వరలోనే పెనాల్టీ విధిస్తామని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేసిన వారందరికీ సమాధానాలు పంపింది. ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌కుమార్, కవిత తదితరుల ఫొటోలుండటంతో చట్టం అమలులో జీహెచ్‌ఎంసీ కళ్లు మూసుకుందని కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్, అంజన్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. 

కారెక్కిన కౌశిక్‌ రెడ్డి..
హుజూరాబాద్​ కాంగ్రెస్‌ మాజీ నేత పాడి కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో కేసీఆర్​ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కౌశిక్​ రెడ్డికి సీఎం కేసీఆర్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్​తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు.
 

మరిన్ని వార్తలు